తెలుగు సంగీత ప్రపంచంలో ప్రస్తుతం సింగర్ బేబీ ఓ సంచలనం. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి రైతుకూలీ మహిళ స్వరానికి ఇప్పుడు సంగీత ప్రపంచం జేజేలు పలుకుతోంది. సోషల్ మీడియా ద్వారా వెలుగు చూసిన ఆమె గాత్రాన్ని ఇప్పుడు సంగీత దిగ్గజాలు కూడా ఔరా అని మెచ్చుకుంటున్నారు.



తాజాగా సింగర్ బేబీని గాన గంధర్వుడుగా పిలుచుకునే బాల సుబ్రహ్మణ్యం ప్రశంసించారు. ఆమెను తన పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కు అతిథిగా ఆహ్వానించి ఆమెతో పాట పాడించారు. ఆమె పాట పూర్తికాగానే బాలు లేచి చప్పట్లతో ఆమెను అభినందించారు. పాడుతా తీయగా కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు కూడా బేబీ పాట పూర్తికాగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టారుఆ సందర్భంగా బాల సుబ్రహ్మణ్యం సింగర్ బేబీపై ప్రశంసల వర్షం కురిపించారు.



ఒక పాట వీడియోకు కొన్ని లక్షల లైకులు, వ్యూలు రావడం సంగీత స్రష్టలకే కష్ట సాధ్యంగా ఉంటుందని అలాంటిది బేబీ పాటకు లక్షల్లో లైకులు రావడం చెప్పుకోదగిన గుర్తింపుగా వర్ణించారు. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మంచిలో ఇదొకటిగా బాలు అభిప్రాయపడ్డారు.



మొదట్లో సింగర్ బేబీ గురించిన పాట వీడియో తన వద్దకు వచ్చినప్పుడు త్వరగా చూడలేకపోయానని.. కానీ ఆ తర్వాత చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఒక పల్లెటూరి రైతుకూలీ ఇంత శ్రుతిపరంగా పాడటం చాలా అరుదని మెచ్చుకున్నారు. అందుకే పాడుతా తీయగాకు పిలిచి గౌరవించుకుంటున్నామని అన్నారు.



ఇంత మంచి మట్టిలో మాణిక్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మాయి కాళ్లకు సంగీత ప్రపంచమంతా దండం పెట్టుకోవాలని ఎస్పీ బాలు అన్నారు. బేబీ కుటుంబంలో ఎవరో ఒకరు సంగీతానికి సంబంధించి ఉండి ఉంటారని లేకపోతే ఇంత సంగీత సంస్కారం అసాధ్యమని బాలు అభిప్రాయపడ్డారు. తనను పిలిచి గౌరవించి పాడుతాతీయగాపై పాట పాడే అవకాశం ఇచ్చిన బాలు గారికి బేబీ కృతజ్ఞతలు తెలిపింది. తనకు బాగా ఇష్టమైన గాయకుడు బాలుసుబ్రహ్మణ్యం గారని.. ఆయన పాటలు పాడుకుంటూ పెరిగానని బేబీ చెప్పారు. బాలు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: