ఆయన గాన గంధర్వుడు. ఆయన పాట వింటే చాలు మనసు అలా తేలియాడుతుంది. మధుర గానానికి పెట్టింది పేరు  తన వాయిస్ తో  అర్ధ శతాబ్దంగా అందరినీ అలరిస్తూనే ఉన్నారు. అటువంటి ఆయన ఎందుకో అసహనం వ్యక్తం చేశారు. తెలుగు భాష అన్నా, పాట అన్నా, మన కట్టు బొట్టు అన్నా ఇష్టపడే బాలు ఇపుడు తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు.


తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలు మాట్లాడుతూ, వర్తమాన రాజకీయాలపై మండిపడ్డారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి ఎలా మారుతారని నిలదీశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు తమ స్వార్ధం చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించని వారు రాజకీయాలు చేయడం ఎందుకని కూడా ఆయన ప్రశ్నించారు. ఒకపుడు మహానుభావులు పాలన చేస్తే ఇపుడు చాలా మంది రాజకీయ నాయకులకు విలువలు పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు, అవినీతిపరులు రాజకీయాల్లోకి వస్తున్నారని బాలు ఆందోళన వ్యక్తం చేశారు.


అదే విధంగా భారతీయ సంస్క్రుతి, సంప్రదాయాలు గాడి తప్పడంపైన కూడా బాలు ఆవేదన చెందారు. ముఖ్యంగా తెలుగు కట్టు, బొట్టు మనదైన వస్త్రధారణ కనుమరుగు అవుతున్నాయని, ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు. ఒకనాడు మహానటి సావిత్రి చక్కగా కట్టు బొట్టుతో  సినిమాల్లో కనిపిస్తే ఈ జనం చూసి ఆదరించలేదా అని ఆయన ప్రశ్నించారు. . తెలుగు భాష పట్ల మక్కువ మమకారం కూడా తగ్గిపోవడం తనను కలచివేస్తోందని కూడా బాలు అన్నారు. మొత్తానికి బాలు తనలో గూడు కట్టుకున్న బాధను ఒక్కసారిగా బయటపెట్టారేమోననిపిస్తోంది. నిజానికి రాజకీయల పట్ల ఎపుడు స్పందించని బాలు ఇపుడు ఇల్లా మాటల తూటాలు పేల్చడం పట్ల సర్వత్రా  చర్చ సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: