అదేం కాలంలో కానీ మంచి చెప్పే వారిని కూడా హేళనగా చూసే రోజులు వచ్చేశాయి. పెద్దవారు, ఎంతో జీవితం చూసిన వారు సమాజం గురించి నాలుగు మంచి మాటలు చెబుతామంటే వినే వారు లేరు. పోనీ దాన్ని అలా పక్కన పెడితే చెప్పిన వారిపై దెప్పి పొడుపులు సెటైర్లు వేయడమేంటి. 


సుప్రసిధ్ధ సినీ నేపధ్యగాయకుడు, నిర్మాత, నటుడు బహుముఖీయమైన ప్రతిభా పాటవాలు కలిగిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజాగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు వస్త్ర ధారణ విషయమై  పెద్దవానిగా, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వానిగా తన మాట వినే వారుంటారని బాలు కొన్ని మాటలు మాట్లాడారు నలుగురు పెద్దవాళ్ళు ఉన్న చోట, పబ్లిక్ ఫంక్షన్లలో ఆడవాళ్ళు మంచి దుస్తులతో  వస్తే బాగుంటుందని, పొట్టి దుస్తులు, కురచ బట్టలతో రావడం తగదని బాలు అన్నారు.ఇందులో తప్పేముంది.. . తిరుమలలో కూడా సంప్రదాయ వస్త్రాల్లో రావాలని ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే పది మంది ఉన్న చోట పవిత్రత ఉండాలని, ఓ మంచి కార్యక్రమం పై ఏకాగ్రత చెడకుండా ఉండాలని అలా నియమం పెట్టారు. బాలు కూడా అన్నది అలాంటిదే.


దీని మీద కొంతమంది సెలిబ్రిటీస్ సెటైర్లు వేస్తున్నారు. తెలిసీ తెలియక విమర్శలు కూడా చేస్తున్నారు. మహానుభావులు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నిజానికి వ్యక్తిగత స్వేచ్చ అన్నది అందరికీ ఉంది. బాలు చెప్పినది దాన్ని భంగపరచమని కాదు. పది మందిలో ఉన్నపుడు కట్టు బొట్టు ఎలా ఉండాలో చెప్పారాయన. దాన్ని చిలవలు పలవలు చేసి మాట్లాడే వారు దీన్ని అర్ధం చేసుకోవాలి. ఇక దీని మీద సీనియర్ నటీమణి జయసుధ కూడా మద్దతు ఇస్తూ బాలు తప్పేమి మాట్లాడారు అంటూ ప్రశ్నించారు.


భారతీయత మన సంస్క్రుతి గురించి చెబితే కుర్ర కారు అర్ధం చేసుకోకపోవడానికి  జనరేషన్ గ్యాప్ అనుకోవాలి. వారికి కూడా తెలిసేట్టు చెప్పాలి. కానీ వయసులో అన్ని విధాలుగా పెద్దవారు కూడా ఇలా పెడ ధోరణిలో మాట్లాడుతూంటే ఏమనాలో మరి. ఏది ఏమైనా మన కట్టు, బొట్టు అన్నవి చెప్పడంలో తప్పు లేదు. లేవని ఆవేదన వ్యక్తం చేయడంలోనూ తప్పు లేదు. అలా చెప్పడమే తప్పు అనడం మాత్రం మహా తప్పు. దీని నయా అభ్యుదయమనాలో  మరేమనాలో తెలియడంలేదుగా.


మరింత సమాచారం తెలుసుకోండి: