అన్న నందమూరి వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవరూ ఆయన ఒకరికి తల వంచుతారంటే నమ్మరు. ఆయన జీవితం మొత్తం అలాగే సాగింది. ప్రతీదీ  కష్టించి సాధించుకోవడమే  అన్న గారికి తెలుసు. ఆయనకు రాజకీయ ఎత్తులు పై ఎత్తులు తెలియవు కానీ ప్రజలను నమ్మడం, వారి బలంతోనే గెలుపు పిలుపును అందుకోవడం అన్న గారికి తెలుసు. అందువల్ల ఆయన మరొకరి మీద ఆధారపడి ఏ విజయాన్ని తీసుకోలేదు.


అయితే మహానాయకుడు మూవీలో మాత్రం అన్న గారు తన చిన్నల్లుడు మీద రాజకీయంగా  పూర్తిగా ఆధారపడినట్లుగా చిత్రీకరించారు. నిజానికి అప్పటికి చంద్రబాబు పార్టీలోకి వచ్చి చేరిన జూనియర్ నాయకుడు మాత్రమే. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారిలో కాంగ్రెస్ లో పనిచేసిన సీనియర్ నేతలు కూడా ఉన్నారు. కానీ నాదెండ్ల ఎపిసోడ్ వంటివి చూపించినపుడు ఒక్క బాబు వల్లనే అన్న రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారని చూపించడం పైన పూర్తి వ్యతిరేకత వస్తోంది. 


నిజాలను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తేనే బయోపిక్కులకు అర్ధం, పరమార్ధం. ఇవాళ‌ ఉన్న నాయకుల మెప్పు కోసమో, లేక గొప్ప కోసమే జీవిత చరిత్రలను తిరగరాసి సొంత కధలను జొప్పిస్తే రేపటి తరాలు  అదే నిజమనుకునే ప్రమాదం ఉంది. పైగా ఏ మహా నాయకుడి గురించి చెప్పబోతున్నామో ఆయనకే తలవంపులు తెచ్చినట్లుగా ఉంటుంది. మహానాయకుడు అని పేరు పెట్టి మరో నాయకున్ని పెద్దగా చూపించడం పైన ఇపుడు సోషల్ మీడియాతో సెటైర్లు పడుతున్నాయి. ఏది ఏమైనా ఈ మూవీ ఓ రాజకీయ పార్టీని, అధినాయకున్ని పాజిటివ్ గా చూపించేందుకే తీశారని వచ్చిన ఆరోపణలకు మాత్రం బలం చేకూర్చేలా ఉందంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: