కోడి రామక్రిష్ణ తెలుగు సినిమా రంగంలో దిద్గర్శకుడు. ఆయన సౌమ్యుడు.  వివాదరహితుడు , పని రాక్షసుడు. అతి తక్కువ సమయంలో శతాధిక చిత్రాలు తీసి గురువు దాసరి నారాయణరావుకు తగిన శిష్యుడు అనిపించుకున్నారు. అసిస్టెంట్  డైరెక్టర్ గా సినీ సీమలో ప్రవేశించిన కోడి రామక్రిష్ణ పదేళ్ల పాటు గురువు దాసరి వద్దనే పనిచేసి రాటుదేలారు. గురువు గారిని పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత కె రాఘవే రామక్రిష్ణకు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా దాసరి, కోడిల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి.


ఇద్దరూ పుట్టింది  పాలకొల్లులోనే. ఇద్దరిదీ నాటక రంగం నేపధ్యమే. ఇద్దరూ సినిమాలను వేగంగా తీసేవారు. ఇద్దరూ అన్ని రకాల జోనర్లలోనూ మూవీస్ తీయగల దిట్టలే. ఇద్దరూ ఎంతో మంది నటీ నటులకు అవకాశాలు ఇచ్చిన వారే. ఇద్దరికీ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఈ ఇద్దరినీ ఇండస్ట్రీ ఎంతగానో కోరుకుంది. ఓ విధంగా తెలుగు సినిమాకు దాసరి , కోడి రామక్రిష్ణ ఆస్తులుగా ఉన్నారంటే అందులో అతిశయోక్తి లేదు. నిర్మాత శ్రేయస్సే ధ్యేయంగా చేసుకుని సినిమాలను తీసిన ఘనత ఆ ఇద్దరికీ దక్కుతుంది. ఇద్దరూ లో బడ్జెట్ మూవీస్ తీసారు, అలాగే హై బడ్జెట్ మూవీస్ తీశారు. ఇద్దరికీ సామాజిక స్ర్పుహ ఎక్కువే.  వారి నిర్దేశకత్వంలో ఎన్నో ఆలోచింపచేసే సినిమాలు వచ్చాయి.


ఇక్కడ మరో పోలిక కూడా ఉంది. ఇద్దరు నటులే. అనేక సినిమాల్లో దాసరి నటించారు. అలాగే కోడి రామక్రిష్ణ కూడా నటించి ఆ పాత్రలకు వన్నె తీసుకువచ్చారు. ఇక కోడి రామక్రిష్ణ  మహేష్ బాబుని వెండి తెరకు పరిచయం చేశారు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. 1985  సంవత్సరంలో పోరాటం అనే మూవీ ద్వారా అప్పటికి 9 ఏళ్ళ వయసు ఉన్న మహేష్ ని బాలనటుడిగా పరిచయం చేసిన ఘనత అచ్చంగా కోడి రామక్రిష్ణదే. ఇక తెలుగులో సుమన్ కి తరంగిణి మూవీ ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి కెరీర్ నిలబెట్టారు. అలాగే భానుచందర్ కి కూడా లైఫ్ ఇచ్చారు. ఇక విలన్ గా రామిరెడ్డి ని అంకుశం మూవీలో పరిచయం చేసి బెస్ట్ కెరీర్ ని ఇచ్చారు. ఆహుతి మూవీ ద్వారా అహుతి ప్రసాద్ ని కూడా ఆయనే తెలుగు సినిమాకు అందించారు. టాలెంట్ చూసి అవకాశాలు ఇవ్వడంలో గురువు దాసరి తరువాత కోడి రామక్రిష్ణనే చెప్పుకోవాలి. 


టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలక్రిష్ణలకు సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కోడి రామక్రిష్ణ. బాలయ్యకు ఫస్ట్ హిట్ మంగమ్మగారి మనవడు రూపంలో దక్కింది. అప్పట్లో 500 రోజులకు పైగా ఆ మూవీ ఆడింది. అలాగే చిరంజీవికితో కోడి రామక్రిష్ణ తీసిన  ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య మూవీ కూడా 500 రోజులు ఆడింది. పొలిటిక‌ల్ మూవీస్ తీశారు,  దేవుళ్ల సినిమాలు తీశారు, దెయ్యాల సినిమాలు తీశారు. అరుంధతి లాంటి మూవీతో అనుష్క కెరీర్ ని మలుపు తిప్పారు.



బాల  నటులతో దేవుళ్ళు మూవీస్ తీసి హిట్ కొట్టారు. దాసరి స్కూల్లో ఎదిగిన కోడికి స్టార్లతో అవసరం లేదు. కధే ఆయనకు స్టార్. అలాగే అనేక విజయవంతమైన మూవీస్ తీశారు. దర్శకుడిగా  ఆయన ఎపుడూ పరుగు ఆపలేదు. మరణించడానికి  మూడేళ్ల ముందు వరకూ మెగా ఫోన్ పట్టుకునే ఉన్నారు. ఏది ఏమైనా ఓ దాసరి, ఓ కోడి లాంటి వారిని సినీ సీమకు  అందించిన  పాలకొల్లు ధన్యమైన పుణ్యభూమి. 


మరింత సమాచారం తెలుసుకోండి: