అదేదో సినిమాలో అంటుంది  ఓ క్యారక్టర్ చెరిపేస్తే చెరిగిపోవడానికి చిత్తు కాగితం కాదు ఇది చరిత్ర అని. అనంత కాల గమనంలో మానవుని జీవనం చాలా చిన్నది. అయితే కాలానికి మాత్రం ప్రతి మలుపు గుర్తుంటుంది. ప్రతి పిలుపు గుర్తుంటుంది. ఒకనాటి కాలంలో జరిగినది మరో కాలంలో వెలుగులోకి తప్పకవస్తుంది.


అదే లక్ష్మీస్ ఎంటీయార్.మూవీ ద్వారా మరో మారు తెలిసింది. ఆనాడు నిజమైన అన్న గారు అభిమానులు పడిన వేదన, రోదన అంతా ఇంతాకాదు. తాము ఎంతో అభిమానించే నందమూరిని సొంత కుటుంబీకులే ద్రోహం చేశారన్నది తెలుసుకున్న తెలుగు ప్రజానీకం షాక్ తిన్న సందర్భమది. నాటి ఘటనలను కళ్ళకు కట్టినట్లుగా తీసిన ఘనత అచ్చంగా  రామ్  గోపాల్ వర్మకే దక్కుతుంది. జీవితాన్ని అలా చూపించి కాలాన్ని ఒక్కసారిగా  ఇరవై మూడేళ్ళ వెనక్కు తీసుకెళ్ళిపోయాడు. నందమూరి నట్టింట జరిగిన వెన్నుపోటుని పూసగుచ్చినట్లుగా సెల్యూలాయిడ్ మీదకు ఎక్కించి చూపించాడు.


అన్న గారికి జరిగినది మళ్ళీ ఎవరికీ జరగకూడదన్నది ఈ మూవీ చూసిన నేటి తరం కూడా అనుకునేలా ఉందని అంటున్నారు. ముఖ్యంగా వెన్నుపోటు ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. నందమూరి తారక రామారావు నిర్భయంగా బతికారు. తన కోసం అండగా ఉన్న లక్ష్మీ పార్వతిని నలుగురిలో ధైర్యంగా వివాహం చేసుకున్న మేటిగా ఆయన నిలిచారు.  చివరి దశలో ఆయన పడిన కష్టాలు, దైన్యం  అన్న గారి అభిమానులకు కంట తడి తెప్పించేవే. మొత్తానికి కాలమనే కాగితం మీద రామ్ గోపాల వర్మ గతం గుర్తులను మరో మారు ఆవిష్కరించిన చిత్రం లక్ష్మీస్ ఎంటీయార్.



మరింత సమాచారం తెలుసుకోండి: