పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పుడు తనకు వెంటనే ముఖ్యమంత్రి అవ్వాలి అన్న కోరిక లేదు అంటూ సంకేతాలు ఇచ్చాడు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాను రాబోతున్న ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని చెపుతూ తాను ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా చేయబోయే మొదటి ఫైల్ సంతకం గురించి చెపుతూ హడావిడి చేస్తున్నాడు. 

అయితే పవన్ చెపుతున్న మాటలు ప్రజలు ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో చాలామంది ‘జనసేన’ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడ రావు అన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలలో ప్రత్యర్ధులు నెగిటివ్ ప్రచారం చేయడం సర్వసాధారణమే అయినా పవన్ పోటీ చేస్తున్న రెండు స్థానాలలోనూ ఓడిపోతాడు అంటూ జరుగుతున్న ప్రచారం పవన్ అభిమానులకు షాక్ ఇస్తోంది. 

దీనికితోడు రాబోతున్న ఎన్నికలలో అధికారం చేపట్టాలని ఒకరిపై ఒకరు ఊహించని ఎత్తులు వేసుకుంటున్న తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడ తమ పార్టీ విజయం గురించి ఆలోచిస్తూనే పవన్ పోటీ చేస్తున్న రెండు స్థానాల గురించి ఒకరికి తెలియకుండా ఒకరు గురిపెడుతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఆదిలోనే పవన్ ను కనీసం ఎమ్.ఎల్.ఏ గా కాకుండా అడ్డుకట్ట వేస్తే భవిష్యత్ లో ఎన్నికల తరువాత పవన్ కు సంబంధించిన కనీసం నెగిటివ్ కామెంట్స్ కూడ కొత్త అసెంబ్లీలో వినిపించకుండా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్.

పవన్ పోటీ చేస్తున్న భీమవరం గాజువాక స్థానాలలో పవన్ సామాజిక వర్గం ఓట్లు చాల ఉన్నా ఆ ఓట్లను పోలింగ్ బూత్ వరకు తీసుకు వెళ్ళగల క్యాడర్ ఎక్కడా ‘జనసేన’ లో కనిపించడం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు పవన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ తన నియోజక వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. పవన్ అన్న చిరంజీవి ప్రచారానికి దూరంగా ఉండటంతో పాటు మరో అన్న నాగబాబు నర్సాపూర్ ఎన్నికలలో బిజీగా ఉన్న నేపధ్యంలో సొంత మనిషి అంటూ లేకుండా పవన్ చేస్తున్న ఒంటరి పోరాటం ఫెయిల్ అయితే రాజకీయ పరంగానే కాకుండా సినిమాల పరంగా కూడ పవన్ కోల్పోయే ఇమేజ్ తిరిగి బిల్డప్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: