లక్ష్మీస్ ఎన్టీఆర్ .. ఎన్నో వివాదాలతో విడుదలై మంచి ఓపెనింగ్స్ సంపాదించుకున్నది. జనాల్లో ఎక్కడ లేని క్యూరియాసిటీ ని ఈ సినిమా రేపిందంటే అతిశయెక్తి కాదు. రెక్ట్ కథ పడాలే కాని.. స్క్రీన్ ప్లేతో చెడుగుడు ఆడుకునే రామ్ గోపాల్‌ వర్మ చాలా ఏళ్ల తరువాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అనేక వివాదాలు.. కోర్టు కేసులు.. స్టేలు.. తెలుగు తమ్ముళ్ల నిరసనల మధ్య శుక్రవారం నాడు విడుదలైన వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది. 


ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీ పార్వతి కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథను తయారుచేసిన వర్మ.. ఈ చిత్రంలో చూపించినవన్నీ.. నిజమా అబద్ధమా అన్న విషయాలపై భిన్నవాదనలు నడుస్తున్న సందర్భంలో తాను అనుకున్న కథను కన్విన్సింగ్ గా బ్యాలెన్స్ చేస్తూ మెజారిటీ ఆడియన్స్ మద్దతుని కూడగట్టాడు. ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే.. సుమారు 550 థియేటర్స్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నించగా.. చివర్లో హైకోర్ట్ స్టేతో నైజాంలో 250 థియేటర్స్‌కి మాత్రమే పరిమితం అయ్యింది.


దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ఆంధ్రలో అన్ని షోలు రద్దు కావడంతో తెలంగాణలో విడుదల అవుతుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయినప్పటికీ.. 55% వరకు ఆన్ లైన్ బుకింగ్స్‌తో జోరు చూపింది. యూఎస్‌లో 125 స్క్రీన్స్‌పై భారీగా విడుదలైన ఈ మూవీ.. తొలిరోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఒక్క ప్రీమియర్ షోస్ ద్వారా 90,214 డాలర్లు రాబట్టింది. ఇక సినిమాకి పాజిటివ్ రావడంతో శుక్రవారానికి మరింత పుంజుకున్నాయి. గురు, శుక్రవారాలను కలుపుకుని 145,928 డాలర్లు ఓపెనింగ్స్ వసులు చేసింది లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీమియర్ షోస్ ద్వారా 482,599 డాలర్లు రాబట్టగా.. ఎన్టీఆర్ మహానాయకుడు 102,234 డాలర్లు రాబట్టింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ 90,214 డాలర్లు రాబట్టింది. కాగా తెలంగాణలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం.. సంక్రాంతి తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి క్యూ కడుతుండటంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వీకెండ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టివచ్చునని ట్రేడ్ అనలిస్ట్‌లు లెక్కలు కడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: