సినిమా రంగం పెద్ద ఎత్తున అకట్టుకునే రంగం. ఉపాధి కోసమైనా డబ్బుతో పాటు విపరీతమైన పేరు ప్రఖ్యాతులు అక్కడ వస్తాయి. అదే డబ్బు మరే చోట వచ్చినా పేరు రావడం కష్టం. ఇక జనాలు పిచ్చిగా అరాధించే వారిలో సినిమా వారు మొదటి స్థానంలో ఉంటారు. వారు ప్రతి ఇంట్లో ఉంటారు. ప్రతి గుండెల్లో ఉంటారు.

 

జనంతో అంతలా ముడిపడి ఉన్న సినిమా వారు అదే జనాన్ని కదిలించి ముఖ్యమంత్రులు అయిన అద్భుతమైన సంఘటనలు చాలా ఉన్నాయి. పొరుగున ఉన్న తమిళనాడులో ఎంజీయార్, కరుణానిధి, ఆయన గురువు అన్నాదురై, తరువాత జయలలిత సినిమా రంగం నుంచే వచ్చారు. ఆ గాలి సోకి ఏపీలో అన్న నందమూరి కూడా ఎకాఎకిన ముఖ్యమంత్రి అయిపోయారు. మరి తమిళనాడులో చూస్తే జయలలిత కరుణానిధి శకం ముగిసాక సినిమా గ్లామర్ ఎవరన్నది ప్రశ్నగా ఉంది.

 

రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీ యాల్లోకి వచ్చారు. మరి 2021లో అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వారు తమ లక్ పరీక్షించుకుంటారు.  ఏది ఏమైనా ఎంజీయార్ నాటి రోజులు ఇపుడు అక్కడ లేవన్నది నిజం. ఇక ఏపీ విషయానికి వస్తే ఆది, అంతం అన్న గారే ఇక్కడ. ఆయన తరువాత పోలోమంటూ ఎంతో మంది సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీఎం సీటు పట్టలేకపోయారు. 2009 ఎన్నికల్లో ప్రభంజనం లా వచ్చిన చిరంజీవి సైతం చతికిలపడ్డారు. ఇక 2019 ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ పరిస్థితి  అలాగే కనిపిస్తోంది.

 

పోలింగ్ సరళి చూస్తే జనసేన ప్రభావం తక్కువేనని అంటున్నారు.  మొత్తం మీద చూసుకుంతే రీల్ హీరోలు రియల్ హీరోలుగా మారే క్రమంలో ఎన్నో ఆటంకాలు ఉన్నాయని అర్ధమవుతోంది. ఒకనాటి పిచ్చి ఫ్యాన్స్ ఇపుడు లేరు. పైగా టెక్నాలజి వచ్చేసింది. ఎవరికి వారే హీరోలు. ఇక రాజకీయాల్లో చూసుకుంటే జనానికి దగ్గరగా ఉండే వారే గెలుస్తున్నారు. వెండి తెర నుంచి వస్తే దేవుడు కాదని జనం భావిస్తున్నారు. అందుకే సీఎం అవడం అనే బిగ్ టాస్క్ ని సినీ జీవులు చేదించలేకపోతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: