హీరోలకు పరాజయం ఉండదు అదేవిధంగా ట్రాజిడీ ఎండింగ్ తో ఉండే టాప్ హీరోల సినిమాలను జనం చూడరు. అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ గా మారుతున్న ఫెయిల్యూర్ హీరోల కథల సినిమాలు ఇప్పుడు వరసగా విజయాలు తెచ్చుకోవడంతో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

దీనికి కారణం ఒకే నెలలో కేవలం ఒకే ఒక్క వారం గ్యాప్ తో వచ్చిన 'మజిలీ'  'చిత్రలహరి' ఇలా ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడమే కాకుండా కలక్షన్స్ విషయంలో కూడ ఈ రెండు మూవీలు వాటి స్థాయిలో విజయవంతం కావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈరెండు సినిమాలలోనూ హీరోలు మధ్య తరగతి నేపధ్యం ఉన్న వ్యక్తులు కావడమే కాకుండా రకరకాల కారణాలు వల్ల వారు ఎంచుకున్న రంగాలలో రాణించలేకపోతారు. 

'మజిలీ' మూవీలో హీరో ప్రేమలో విఫలం చెంది తాను ఎంతో ఇష్టపడ్డ క్రికెట్ కు దూరం అయి తాగుబోతుగా మారతాడు. 'చిత్రలహరి' మూవీలో ఇంజనీర్ అయిన ఒక వ్యక్తి వరస వైఫల్యాలు చెందుతూ అక్కడ కూడ త్రాగుబోతుగా మారుతాడు. ఇది చాలదు అన్నట్లుగా ఈవారం విడుదల కాబోతున్న 'జెర్సీ' మూవీలో హీరో కొన్ని కారణాలు వల్ల తాను ఇష్టపడే క్రికెట్ కు దూరం అయి భార్య సంపాదన పై ఆధారపడుతూ ఆమెతో తిట్లు పడుతూ ఉంటాడు. 

దీనితో ఈ సినిమా కథ కూడ ఫెయిల్యూర్ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు ఈసినిమా పై కూడ  అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ నెలలో వరసగా విడుదల అవుతున్న ఈ మూవీల హీరోల జీవితం అంతా పరాజయాల చుట్టూ బాధల చుట్టూ అల్లుకోవడం షాకింగ్ గా మారింది. అయితే ఈసినిమాలు అన్నింటినీ ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో పూర్తిగా మార్పు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుత తరం ప్రేక్షకులు తాము కళలు కన్న జీవితాలను రకరకాల కారణాలతో చాలామంది అందుకోలేక పోతున్న పరిస్థుతులలో ఇలా హీరోల ఫెయిల్యూర్ కథలకు విజయాలు వస్తున్నాయా అని సందేహాలు రావడం సహజం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: