ఆ బ్యూటీకి మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చాయి. హిట్లు కూడా బాగా పడ్డాయి. ఆమెకు అందం ఉంది, అభినయం కూడా ఉంది. ఓ దశలో స్టార్ హీరోయిన్ అవుతుందని కూడా అంతా వూహించారు. అదేమి చిత్రమో కానీ కెరీర్ ఒక్కసారిగా పడకేసింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్లుంది పరిస్థితి. ఇపుడు ఓ మూవీ మీదనే ఆమె ఆశలు పెట్టుకుంది. 



‘అందాల రాక్షసి’గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే కావలసినంత గుర్తింపు తెచ్చుకుంది. భ‌లే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి సూపర్‌హిట్ సినిమాలు తన ఖాతాలో ఉండటంతో ఆఫర్లూ ఫుల్లుగానే వచ్చాయి. కానీ 2016లో ‘శ్రీరస్తుశుభమస్తు’ తర్వాత లావణ్యకు హిట్ అన్నదే లేదు. రెండేళ్లకాలంలో ఆరు తెలుగు సినిమాలు విడుదలైతే అన్నీ బాక్స్ ఆఫీస్‌దగ్గర బోల్తాకొట్టడంతో లావణ్య కెరీర్ ఇప్పుడు నిరాశాజనకంగా ఉంది.



అటువంటిది  లావణ్య చేతిలో ఇప్పుడు ఒకే సినిమా ఉంది. అదే నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ సురవరం’. ఈ సినిమా కనుక హిట్టయితే లావణ్యకు తన కెరీర్‌లో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. సినిమా కనుక నిరాశపరిస్తే లావణ్య కెరీర్ చివరిదశకు చేరినట్టేనని సన్నిహితులే అంటున్నారు. అందుకే ఈ సినిమా విజయంపై లావణ్య భారీగా నమ్మకం పెట్టుకుంది. తమిళ సూపర్‌హిట్ ‘కనిదన్’కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా కావడంతో కంటెంట్‌పరంగా స్ట్రాంగ్‌గా ఉంది. లావణ్యకు రిలీఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ‘అర్జున్ సురవరం’ మే1న విడుదల కానుంది.



ఈ మూవీ కానీ హిట్ కొడితే లావణ్య  తెలుగు తెరను మరో మారు కమ్మేస్తుందంటున్నారు. నిజానికి తెలుగు తెరకు హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. సీనియర్లు సైతం జోడీ కోసం వెతుక్కుంటున్నరు. అటువంటిది లావణ్య  సీనియర్లతో సైతం నటించేందుకు రెడీ అంటోంది. సో అర్జున్ సురవరం హిట్ అయితే లావణ్యకు టాలీవుడ్లో మళ్ళీ ఆఫర్లు వెల్లువెత్తం ఖాయమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: