జూనియర్ ఎన్టీఆర్ పేరుకు నందమూరి వారసుడు అయినా సినిమాలో పేరు ప్రఖ్యాతలు అంత ఈజీగా రాలేదు. ఎంతో కష్టపడి తనను తానూ గొప్ప నటుడిగా నిరూపించుకున్నాడు. అయితే చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో తాతయ్య అంటూ తిరిగేవాడిని...ఆయన గురించి తెలిశాక రామారావు గారు, అన్నగారు అంటూ పిలవాలనిపించేది అంటూ గతంలో ఓ సందర్భంలో యంగ్ టైగర్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు వద్ద పని చేసిన లక్ష్మణ్ ఈ తాత మనవళ్ల మధ్య అనుబంధం ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నారు. 


‘‘సార్ అబిడ్స్‌ ఇంట్లో ఉండే సమయంలో... జూ ఎన్టీఆర్ తన తల్లి శాలినితో కలిసి నల్లకుంటలోని శంకర్‌మఠ్ సమీపంలో ఉండేవారు. అప్పుడు తాతను కలిసేందుకు వాళ్ల అమ్మ వండిన పదార్థాలు క్యారేజ్ కట్టుకుని రామకృష్ణ స్టూడియోకు వచ్చేవాడు'' అని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. జూ ఎన్టీఆర్ రాగానే... పెద్దాయన ‘‘ఏం తాత ఏం తెచ్చావ్'' అనేవారు. తిన్న తర్వాత సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో మేము వెళ్లే కారులోనే వస్తుండేవాడు. శంకర్‌మఠ్ మెయిన్ రోడ్డు మీద కారు ఆపితే... దిగి నడుచుకుంటూ వెళ్లేవాడు. బాబు ఇంటికి వెళ్లే వరకు పెద్దాయన కారులోనే ఉండి చూసేవారని లక్ష్మణ్ తెలిపారు. 


అపుడు వారికి కారు లేదు, సొంతగా ఆటో ఉండేది. ఆ ఆటోలోనే వచ్చేవాడు. ఆయన్ను దించి ఆటో వెళ్లిపోయేది. వెళ్లేపుడు మేము కారులో తీసుకుని వెళ్లేవారం. ఆ చిన్న వయసులోనే జూ ఎన్టీఆర్ సార్ సినిమాల డైలాగులు అద్భుతంగా చెప్పేవారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. ఓసారి రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంటే సార్ తన మేకప్ మేన్ ముత్తుతో దగ్గరుండి జూ ఎన్టీఆర్‌కు మేకప్ వేయించారు. మేకప్ పూర్తయ్యాక ఆయనే స్వయంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చి... పోరా తాత ఫస్ట్ ఫ్రైజ్ కొట్టుకొస్తావు పో అని పంపేవారు. నిజంగానే జూనియర్ కప్ కొట్టాడు. కప్పు పట్టుకుని తాతయ్య వద్దకు రాగానే... ‘ఒరేయ్ నువ్వు నా పేరు నిలుపుతావురా' అనేవాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: