తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఎస్. శంకర్.  భారీ బ‌డ్జెట్‌తో  చిత్రాలు రూపొందించ‌డ‌మే కాకుండా అంత‌కు రెట్టింపు స్థాయిలో క‌లెక్ష‌న్లు తిరిగి రాబ‌ట్ట‌డం కూడా శంక‌ర్‌కే తెలుసు. తమిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌లో పుట్టిన శంక‌ర్ ప్ర‌స్తుతం దేశంలోని అగ్ర‌ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు. శంకర్ తో సినిమా చేస్తే అది తమ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని స్టార్ హీరోలకి కలిగించిన గొప్పతనం శంకర్ సొంతం. 'జెంటిల్ మేన్',  'భారతీయుడు', 'అపరిచితుడు' , 'ఒకే ఒక్కడు' , 'రోబో' మొదలైన చిత్రాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. 

న‌టుడ‌వుదామ‌ని చెన్నైకి వ‌చ్చిన శంక‌ర్.. అనుకోని ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు ఎస్‌ఏ చంద్ర‌శేఖ‌ర్ (స్టార్ హీరో విజ‌య్ తండ్రి) వద్ద అసిస్టెంట్‌గా చేరి `జెంటిల్మెన్‌`తో మెగాఫోన్ ప‌ట్టాడు. అక్క‌ణ్నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ద‌క్షిణాది గ‌ర్వించద‌గ్గ ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. కథాకథనాల పరంగానే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా దక్షిణాది చిత్రాల స్థాయిని పెంచిన శంకర్, దర్శకుడిగా 25 వసంతాలను పూర్తి చేసుకున్నాడు.


ఈ సందర్భంగా తమిళనాట ప్రముఖ దర్శకులంతా, 'రీ యూనియన్ మీట్' పేరుతో శంకర్ ను కలిసి శుభాకాంక్షలు అందజేశారు.  బ్లూ అండ్ బ్లూ యూనిఫామ్ లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో శంక‌ర్‌తోపాటు ద‌ర్శ‌కులు మణిర‌త్నం, గౌత‌మ్ మీన‌న్‌, పా రంజిత్‌, పాండిరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అలాగే శంక‌ర్ శిష్యులైన వసంత‌బాలన్‌, అట్లీ, బాలాజీ శ‌క్తివేల్ వంటి ద‌ర్శ‌కులు కూడా హాజ‌ర‌య్యారు. ఆ కార్య‌క్ర‌మంలో వీరంద‌రూ క‌లిసి తీసుకున్న సెల్ఫీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: