మెగా మేనల్లుడుగా టాలీవుడ్‌కు పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో దూసుకుపోయింది. ఆ తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో కెరీర్‌లో పూర్తిగా డౌన్‌ఫాల్ అయినా సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు చిత్రలహరి సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఆరు వరుస డిజాస్టర్‌ల‌తో డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్ల హీరోగా ముద్ర వేయించుకున్న సాయికి చిత్రలహరి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.పూర్తిగా ప‌డిపోయిన సాయి మార్కెట్ చిత్ర‌ల‌హ‌రితో కాస్త పుంజుకుంది. చాలా రోజుల తర్వాత ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ మీడియాతో పాలు అనుభవాలు పంచుకుంటున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్‌తో బాటు సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన  సోదరుడిని కూడా సినిమా ఎంట్రీ చేయించేందుకు సాయి తెర వెనక చాలా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. 


ఇక సాయిధరమ్ తేజ్‌ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న విషయం చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీలో ఉన్న  కొద్ది మందికి మినహా ఎక్కువ శాతం మందికి మాత్ర‌మే ఇది తెలుసు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాయి ధరమ్ తేజ్ తండ్రి ప్రస్తుతం ఆయ‌న  స్వ‌గ్రామంలో నివాసం ఉంటున్నారు. తన తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 15 సంవత్సరాల క్రితమే వారిద్దరు విడిపోయినట్టు సాయి చెప్పాడు. జీవితంలో భార్య, భర్తల మధ్య అగాధం ఏర్పడినప్పుడు వారిద్దరూ ప్రతిరోజు కలహించుకుంటూ కలిసి ఉండటం కంటే విడిపోవటమే మంచిదని కూడా తన అభిప్రాయం చెప్పాడు. వారిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను గౌరవిస్తానని.... అది జరిగిపోయి కూడా పదిహేనేళ్లు అయిందని ఆ విషయాన్ని తాము ఇప్పుడు మర్చిపోయి తమ జీవితంలో ముందుకు సాగుతున్నట్టు సాయి చెప్పాడు. 


ఇంకా తన తల్లిదండ్రుల గురించి సాయి మాట్లాడుతూ నాన్నతో ఎప్పటికీ మంచి రిలేషన్ ఉంది... ఆయనకు సినిమాల గురించి తెలియక పోవడంతో ఆయనతో సినిమాలు గురించి చర్చించ‌న‌న్నాడు. ఇక తండ్రితో విడిపోయాక అమ్మ 2011లో ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న‌ విషయాన్ని సైతం సాయి ఓపెన్ చేసేశాడు.  రేపటి రోజున తాను, తమ్ముడు పెళ్లిళ్లు చేసుకుని తమ జీవితాలను తాము ఎంజాయ్ చేస్తున్న టైంలో  అమ్మ ఒంటరిగా ఉంటుందని భావించామని... చివరకు అమ్మ  మళ్లీ పెళ్లి చేసుకుందని  అన్నాడు. ఇక తనకు స్టెప్ ఫాదర్‌తో మంచి రిలేషన్ ఉందని... ఒంట‌రిగా ఉన్న ఫీలింగ్‌ లేకుండా ఉండటం కోసం అమ్మ తీసుకున్న రెండో పెళ్లి నిర్ణయాన్ని తాము సమర్థించామని సాయి చెప్పాడు.  ఏదేమైనా  సాయి తల్లిదండ్రులు విడిపోయినా ఇటు తల్లితో అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ అటు తన తండ్రితోనూ రిలేషన్షిప్ కొనసాగిస్తుండటం తల్లిదండ్రుల పట్ల అతనికున్న బాధ్యతను ప్రశంసించాల్సిన విషయం.



మరింత సమాచారం తెలుసుకోండి: