"జెర్సీ" ఓడిపోయి గెలిచిన ఒక క్రికెటర్ కథ ! కథ కంటే కూడా ఇది ఒక జర్నీ... తన తండ్రి కథను అందరు చదవాలని కోరుకునే కొడుకు దగ్గర మొదలయ్యే ఈ సినిమా, ఒక గెలుపు కోసం తన తండ్రి చేసిన ప్రయత్నమేమిటనేది చెప్తుంది.  హైదరాబాద్ క్రికెట్ క్లబ్ లో  ఔత్సాహిక ప్లేయర్ గా పేరున్న అర్జున్ కి టాలెంట్ ఎంత ఉన్నా డబ్బు -పలుకుబడి లేకపోవడంతో ఇండియన్ టీంకి  సెలెక్ట్ కాలేడు... అప్పటికే 26 ఏళ్ళు పైగా భార్య-కొడుకు ఉండడంతో క్రికెట్ కి కంటే  ఫ్యామిలీకే తన సప్పోర్ట్ ముఖ్యమని భావించి క్రికెట్ కి దూరమవుతాడు,  అలా క్రికెట్ కి దూరమైనా అర్జున్ జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.

ఉద్యోగం పోయి, భార్య సంపాదనతో ఇల్లు నడుపుతూ, ఎదో కోల్పోయినా వాడిలా  తనలోనే తాను కుమిలిపోతూ ఉంటాడు, అలాంటి సమయంలో తన కొడుకు అడిగిన ఒక కోరిక తీర్చే క్రమంలో.. ఇన్నాళ్ళు తానేమి కోల్పోయాడో తెలుసుకుంటాడు, పదేళ్ళ పాటు క్రికెట్ వదిలేసిన అర్జున్, 36 ఏళ్ళ వయసులో తిరిగి ఇండియన్ టీంలో  చేరాలనే నిర్ణయం తీసుకుంటాడు, మరి ఆ నిర్ణయం అతనికి విజయాన్ని అందించిందా ? తన ఆశయం కోసం అర్జున్ చేసిన కృషి ఏంటి అనేది "జెర్సీ" కథ. 


ఓ నటుడి గొప్పదనం  అతని విజయాల బట్టి  చూసికాదు .. అతను ఎంచుకునే పాత్రల ద్వారా తెలుస్తుంది,  తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్, మార్కెట్, ఫ్యాన్స్ లాంటి లెక్కలు ఏమీ వేసుకోకుండా నాని తరహాలో భిన్నమైన పాత్రలు చేసిన నటుడు మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. స్వతహాగా న్యాచురల్ స్టార్ టాగ్ అందుకున్న నాని.. అర్జున్ పాత్రలో నాని ఎంతలా జీవించాడంటే .. తెర మీద కనిపించేది నాని కాదు అర్జున్ అనేంతలా ప్రేక్షకులను లీనం చేశాడు. ఇక నాని భార్యగా సారా(శ్రద్ధ) చాలా  సహజంగా అనిపించింది,  మనసులో ఎంత కోపం ఉన్న తన భర్తను సప్పోర్ట్ చేసే భార్యగా తను ఆకట్టుకుంది. ఇక నాని కోచ్ గా సత్యరాజ్ నటన అమోఘం, నిత్యం అర్జున్ ని సపోర్ట్ చేస్తూ తనని ప్రోత్సహిస్తు ఉండే పాత్రకు ఆయన సరిగా సరిపోయారు అలానే నాని కొడుకుగా చేసిన పిల్లాడి నటన మన కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాయి. 


ఇక ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నిషియన్ ప్రాణం పెట్టారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ముఖ్యంగా అనిరుధ్ నేపధ్య సంగీతం, సాను వర్గీస్ కెమెరా వర్క్ అన్ని సినిమాని చాలా సహజంగా చూపించాయి.  ఇలాంటి మంచి చిత్రాన్ని ఇంత క్వాలిటీగా నిర్మించడండతో నిర్మాత సూర్యదేవర వంశీ అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్నారు. 


ఇక ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన వ్యక్తి, ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్నురి.  “మళ్ళీ రావా” చూసినప్పుడే దర్శకుడు గౌతమ్ పనితనం మీద గౌరవం ఏర్పడింది. “జెర్సీ” చూశాక ఆ గౌరవం కాస్త ప్రేమగా మారింది. ఒక ఫైట్ లేదు, హీరోహీరోయిన్లు డ్యాన్స్ చేసే ఒక సాంగ్ లేదు, హీరో ఇంట్రడక్షన్ సీన్ అంటూ ఒక స్లోమోషన్ షాట్ లేదు.. ఆఖరికి హీరోయిజం కూడా లేదు. అలాంటి కథను గౌతమ్ ఏ ధైర్యంతో రాసుకున్నాడు, నాని ఎలా ఒప్పుకున్నాడు అని ఒక్కసారైనా సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడికి అనిపించక మానదు.

కానీ.. “జెర్సీ” సినిమాలో పైన పేర్కొన్న కమర్షియల్ అంశాలన్నిటి కంటే ముఖ్యమైన “ఎమోషన్” ఉంది. ముఖ్యంగా ట్రైన్ దగ్గర నాని గట్టిగా అరిచే సీన్, "నువ్వు క్రికెట్ ఆడితే హీరోలా ఉంటావు నాన్న" అనే సీన్స్ ఎమోషనల్ గా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇక క్లైమాక్స్ లో ప్రేక్షకుడిని తన ఎమోషన్ తో కట్టిపడేలా చేశాడు గౌతమ్, నిజంగా టాలీవుడ్ కి గౌతమ్ లాంటి మరో అద్భుతమైన దర్శకుడు దొరకడం చాలా మంచి పరిమాణం. 


ఇక తెలుగు సినిమా అంటే కేవలం కమెర్షియల్ సినిమా అనే మాట నుంచి తెలుగు సినిమా అంటే కంటెంట్ ఉన్న సినిమాగా ముందుకెళ్తున్న తరుణంలో "జెర్సీ" లాంటి సినిమా మన సినిమా పరిధిని మరింత పెంచిందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి మంచి చిత్రాలని ప్రతి ప్రేక్షకుడు ఆదరించడం ఎంతో ఎంతో అవసరం ఎందుకంటే ఇది సినిమాకాదు ...జీవితంలో  ఓడిపోయినా ప్రతి వ్యక్తి  ప్రయాణం!! 


అందుకే "జెర్సీ" ఒక మంచి ప్రయత్నం!


మరింత సమాచారం తెలుసుకోండి: