ప్రముఖ సినీ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్‌ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఏప్రిల్ 30న జరిగిన ఈ ప్రమాదంలో విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు సమాచారం. ధర్మ ప్రొడక్షన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో కరణ్ జోహర్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు ధర్మా ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై తెరకెక్కిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు బూడిదైనట్టుగా తెలుస్తోంది. 

అయితే ఎంత మేరకు ఆస్థినష్టం జరిగిందనే విషయంపై యూనిట్ అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రధాన సినీ నిర్మాణ సంస్థల్లో అగ్ని ప్రమాదం జరగడం ఇది రెండోసారి. దాంతో సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  1976లో కరణ్‌ తండ్రి యశ్‌ జోహర్‌ ఈ స్టూడియోను ప్రారంభించారు. ప్రొడక్షన్‌ కు సంబంధించిన కెమెరాలు, సెట్‌ ప్రాపర్టీస్‌, కాస్ట్యూమ్స్‌, విలువైన వస్తువులు, పుస్తకాలు, సినిమా స్క్రిప్టులు, షూటింగ్ పరికరాలు  ఇతర విలువైన వస్తువులను ఇక్కడే భద్రపరుస్తుంటారు. 

అత్యంత విలువైన పరికరాలు ఉన్న ఈ గోడౌన్‌లోని మొదటి ఫ్లోర్‌లో మంటలు భారీగా వ్యాపించడంతో బూడిదే మిగిలిందని ప్రాథమిక సమాచారం.  ప్రస్తుతం ధర్మా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిన స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2 సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. డబ్బుపరంగానే కాకుండా వెలకట్టలేని వస్తువులు అగ్నికి ఆహుతి కావడం తీరని నష్టంగా భావిస్తున్నారు. కోట్లలోనే ఆస్తి నష్టం జరిగిందనే మాట వినిపిస్తున్నది. ఈ సినిమాతో పాటు గుడ్‌ న్యూస్‌, సూర్యవంశీ, తక్త్‌ చిత్రాలు నిర్మాణదశలో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: