ఆంధ్రప్రదేశ్ లో గత నెల నుంచి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తూ వస్తుంది. అయితే ఈ సినిమా టీజర్ నుంచి ట్రైలర్ వరకు రాంగోపాల్ వర్మ టీడీపీని టార్గెట్ చేసుకున్నారని..ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు చేశారని..ఈ సినిమాలో విలన్ గా చూపించారని టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ నిలిపివేయాలని కోర్టును, ఈసిని ఆశ్రయించారు.  ఎపిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇలాంటి సినిమాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపిలో సినిమా రిలీజ్ ఆపివేశారు.  అయితే ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.  


అప్పటి నుంచి ఈ సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలని గట్టి పట్టుమీద ఉన్నారు వర్మ.  మే 1 న ఈ సినిమా రిలీజ్ చేస్తానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.  కానీ ఈ నెల 23 వరకు ఈ సినిమా ప్రదర్శించరాదని ఈసి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.  అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదలకు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు లేనప్పటికీ కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్,  రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు థియేటర్ యజమానులను హెచ్చరించి వదిలేశారు.  


కాగా ఈ సినిమా ప్రదర్శన విషయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంగించారని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది సిఫారసు చేశారు. ఈ విషయం మరీ సీరియస్ కావడంతో జేసీ కోటేశ్వరరావు థియేటర్లపై చర్యలకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో సినిమా ప్రదర్శించిన మూడు థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: