పూరీ జగన్నాథ్ తన మొదటి సినిమా ఛాన్స్ సంపాదించుకోవడానికి పెద్దగా కష్టపడలేదు. అప్పటికే స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న "పవర్ స్టార్" పవన్ కళ్యాణ్ తో మొదటి సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఆ సినిమానే బద్రి. అంతే కాదు పూరీ కూడా మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. బద్రి తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి.. ఇలా వరుసగా హిట్స్ అందుకున్నాడు. అంతేకాదు కన్నడ లోను కొన్ని సినిమాలను తెరకెక్కించి అక్కడ కూడా స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. 


ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనితో పాటు డబ్బు కూడా ఒక దర్శకుడిగా అంతవరకు ఎవరు సంపాదించలేనంత డబ్బును సంపాదించాడు. అయితే ఒక్కసారిగా వరుస ఫ్లాప్ లు, అదే సమయంలో నమ్మినవాళ్ళు మోసం చేయడం తో అన్నిటిని పోగొట్టుకున్నాడు. కానీ తనలో ఉన్న డైనమిజమే మళ్ళీ పూరీని పూర్వ వైభవానికి తీసుకు వచ్చింది. ఎప్పటిలాగే సూపర్ డూపర్ హిట్స్, లెక్కలేనంత సంపాదన..మళ్ళీ ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించాడు. అయితే గత కొంత కాలంగా పూరీ గాడి తప్పాడు. వరుసగా ఫ్లాప్ లను ఇస్తూ తన మార్క్ కు దూరమవుతున్నాడు. అందుకు కారణం పూరీ.. తీసిన కథనే మళ్ళీ మళ్ళీ తీయడం. ఇది పూరీ అభిమానులకే కాదు సామాన్య ప్రేక్షకుడికి మింగుడు పడటం లేదు. 


పూరీ సినిమా రిలీజైన ప్రతీ సారీ ప్రేక్షకులు ఏదో ఆశతో థియోటర్లకు వెళ్ళడం.. సినిమాలో ఏమీ లేక బిక్క మొహాలతో బయటికి రావడం సాధారణం అయిపోయింది. ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ తో తీసిన పైసా వసూల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా పూరీ అంచనాలను తారుమారు చేస్తూ ఫ్లాప్ ని మూటగట్టుకుంది. ఇక చేసేదేమి లేక తన కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీస్తే అది కాస్తా డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో పూరీతో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాలేదు. సరిగ్గా అదే సమయంలో ఎనర్జిటిక్ హీరో రామ్ తగిలాడు. రామ్ కూడా గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయాడు. అందుకే పూరీ చెప్పిన కథ నచ్చి వెంటనే సినిమాకి కమిట్ అయ్యాడు. వరుస ఫ్లాప్ లలో ఉన్న ఈ ఇద్దరికి ఓ సూపర్ హిట్టు పడాలి. అందుకే రామ్ కూడా "పూరీ సార్ మనకి ఓ హిట్టు కావాలి"...అంటు సెట్ లో పూరీ చెప్పినదానికంటే ఎక్కువగా కష్టపడుతున్నాడట. చూద్దాం ఈసారైనా పూరీ తన మార్క్ తో భారీ హిట్ ని సొంతం చేసుకుంటాడేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: