సినిమా తీద్దామనుకుంటున్న సదరు బడా,ఛోటా నిర్మాతలకూ మరియు ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి సక్సెస్ అన్న పదానికి సదా దూరమవుతున్న సదరు హీరోలకు ఓ సగటు తెలుగు ప్రేక్షకుడి హృదయ విన్నపం.


ముందుగా నిర్మాతలకు....అయ్యా నిర్మాతలు సినిమా వ్యాపారమే కాదనను. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి పైసా మీకు తిరిగి రావాలి. కాని ప్రస్తుతం వంద మంది పెడితే కనీసం పది మందికి కూడా తిరిగి రావడంలేదు. ఎందుకంటే మీరు తియ్యాలనుకున్న సినిమా ఆలోచన సరైన దిశలో తీసుకువెళ్ళేది దర్శకుడు. కాని ఆ దర్శకుడు కానికి కొరగాని హీరోల ఇమేజ్ వలయంలో చిక్కుకుని తాను అనుకున్నది కాకుండా మెదడు లేని సదరు జీరోల పైత్యానికి మీ వ్యాపారాన్ని బలి చేస్తున్నాడు. కాబట్టి సినిమా తీయాలనుకున్న ప్రతి నిర్మాత తాను అనుకున్నదానికి కట్టుబడితే తెలుగు సినిమా తో పాటు మరు నిలబడతారు. దానికి నిదర్శనం రెగ్యులర్ ఫార్ములా లో కాకుండా విభిన్న కథాంశాలోతో విజయాన్ని సొంతం చేసుకున్న పెళ్ళిచూపులు, రంగస్థలం మరియు మహానటి.

ఆఖరుగా నిర్మాతలకు ఒక్క మాట... సినిమా పెద్దదైనా చిన్నదైనా విషయం వుంటే విశేషమవుతుంది లేదా మీ డబ్బులు సశేషమవుతాయి.మా సినిమా హీరోలకు....అయ్యా హీరోలు... వారసత్వంగానో, మరో విశేషంతోనో మీరు తెర మీద హీరోలయ్యారు. ప్రేక్షకులుగా మేము మీకు మీకు ఆరాధ్యులమయ్యాం. మీరు తెర మీద కనబడగానే ఆరు నుండి అరవైఏళ్ళ వాళ్ళంకూడా ఈలలేసేం, గోలచేసేం. అలా మిమ్మల్ని ఆదరించి మీకు తెలియకుండా మీలోని నటుడిని చెరిపేసి మీకో ఇమేజ్ ఏర్పాటు చేశాం. కాని కాలం మారింది, మేమూ మారాం.

సినిమా 35mm నుండి ఐమాక్స్ తెర వరకు వచ్చింది. కాని మీరు మాత్రం మీ ఇమేజ్ చట్రం నుండి బయటకు రాకుండా కొత్త దర్శకుల కొత్త ఆలోచనలను పక్కన పెట్టించి అటు తెలుగు సినిమాని ఇటు సినీ పరిశ్రమను భ్రష్టు పట్టిస్తున్నారు. నాలుగు ఫైట్లు, ఆరు డ్యూయట్లుతో మీ వెర్రితనాన్ని కాకుండా దర్శకులు చెప్పినట్టు వింటే మీరు బాగుపడతారు, పరిశ్రమా బాగుపడుతుంది. నేటి తరానికి కావలసింది స్లో మోషన్ లో చూపించే మీ మగతనం కాదు. ఆకట్టుకునే కధాంశంతో ప్రేక్షకులను కట్టిబడేసే అసలుసిసలైన స్క్రీన్ ప్లే.

అది దర్ళకుల పని. వాళ్ళ పనిని వాళ్ళను చేసుకోనిస్తే వాళ్ళతో పాటు మీరు విజయం అందుకుంటారు. ఆఖరుగా ఒక్కమాట ఎవరు చేయాల్సిన పని వాళ్ళుచేస్తే ప్రతీది రంగస్థలం, మహానటి లాంటి ఆణిముత్యాలు తయారవుతాయి. లేదంటారా వయసుడిగిన ముసలివాళ్ళు, మా సదరు ఇమేజ్డ్ హీరోలు అలా పడిగాపు గాయాల్సిందే. దేనికో మీకు అర్ధం అయిందనకుంటా....

ఇట్లు
ఓ తెలుగు సినిమా ప్రేక్షకుడు


మరింత సమాచారం తెలుసుకోండి: