సుదీర్ఘమైన సినీ ప్రయాణం చేసిన నటుల్లో షావుకారు జానకి ఒకరు. 68 యేళ్ల నట ప్రయాణంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కథానాయికగా, సహ నటిగా పలు రకాల పాత్రల్లో ఒదిగిపోయారు. చిన్నప్పుడే నాటక రంగంతో అనుబంధం పెంచుకొన్న ఆమె, తన 11వ యేట ఓ తెలుగు రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పలు నాటకాలు, రేడియో కార్యక్రమాలు చేశారు. విజయ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘షావుకారు’తో తొలి అవకాశాన్ని అందుకొన్నారు. అందులో ఎన్టీఆర్‌ కథానాయకుడు. ఆ సినిమా పేరే, జానకి ఇంటి పేరుగా మారిపోవడం విశేషం. తొలి చిత్రంతోనే జానకికి మంచి గుర్తింపు వ‌చ్చింది.
అప్ప‌ట్లో ముందు ఆ సినిమాకి  అవ‌కాశం మ‌హాన‌టి సావిత్రిని, త‌ర్వాత భానుమ‌తిని తీసుకుందామ‌నుకున్నారు.త‌ర్వాత జాన‌కిని ఫైన‌ల్ చేశారు. ప్రముఖ తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఈమెకి స్వయానా చెల్లెలు. జానకికి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. ఆమె మనవరాలు వైష్ణ‌వి ప‌లు త‌మిళ చిత్రాల్లో న‌టించారు.
అలాంటి 'షావుకారు' జానకి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. 'షావుకారు' తరువాత నా మనసుకు బాధ కలిగించే సంఘటన ఒకటి జరిగింది. ఒకసారి దర్శకుడు కేవీ రెడ్డిగారు 'ఏయ్ అమ్మాయి ఏవూరు మీది?' అని అడిగారు. 'రాజమండ్రి అండీ' అన్నాను. 'వెళ్లిపో రాజమండ్రికి .. మరీ ఇంతే వున్నావ్ .. అయిదు పూల రాణిలాగా .. గ్లామర్ లేదు ఏమీలేదు .. మంచి పర్సనాలిటీ లేదు .. మా హీరోల పక్కన నువ్వు మరీ ఇంతే కనిపిస్తున్నావు .. నువ్వు హీరోయిన్ గా పనికి రావు గానీ .. వెళ్లు" అన్నారు. 'ఈ పరిశ్రమను నమ్ముకుని ఒక పాపాయితో వచ్చానండీ .. ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోను .. నా కుటుంబాన్ని పోషించుకోవలసిన బాధ్యత నాపై వుంది' అన్నాను. అప్పటి నుంచి మరింత పట్టుదలగా ముందుకు సాగాను" అంటూ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: