‘భాహుబలి’ తో ఇండియన్ టాప్ సెలెబ్రెటీల లిస్టులోకి చేరిపోయిన ప్రభాస్ తన సొంత గొంతు వినిపించడం కోసం పడుతున్న పాట్లకు సంబంధించిన ఒక ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. ‘బాహుబలి’ లో ప్రభాస్ పాత్రకు రాజమౌళి డబ్బింగ్ చెప్పించాడు. అయితే ‘సాహో’ విషయంలో మటుకు ప్రభాస్ బాలీవుడ్ ప్రేక్షకులకు తన సొంత గొంతు వినిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇక్కడ ప్రభాస్ కు అనుకోని కష్టాలు ఎదురౌతున్నట్లు సమాచారం. ప్రభాస్ కు హిందీ భాష పై మంచి పట్టు ఉన్నా అతడు హిందీ మాట్లాడుతున్నప్పుడు దక్షిణాది యాస కనిపిస్తుంది. దీనితో ‘సాహో’ లో తన పాత్ర కోసం డబ్బింగ్ చెప్పడానికి హిందీ భాషకు సంబంధించి ఉత్తరాది యాస వచ్చే విధంగా ప్రభాస్ కొంతమంది దగ్గర ట్యూషన్ పెట్టించుకుని గంటల తరబడి హిందీ డైలాగ్స్ సాధన చేసినట్లు సమాచారం. 

అయితే ప్రభాస్ ఎంత ప్రయత్నించినా ఇంకా అక్కడక్కడ ప్రభాస్ హిందీ డైలాగ్స్ లో దక్షిణాది యాస కనిపిస్తున్న నేపధ్యంలో తన హిందీ డైలాగ్స్ మాడ్యులేషన్ కు సంబంధించి మరొకసారి ఒక హిందీ ట్యూటర్ వద్ద ప్రభాస్ హిందీ డైలాగ్స్ పలికే విషయంలో మళ్ళీ సాధన చేస్తున్నట్లు సమాచారం. తన గొంతులో ఆ స్పష్టత వచ్చిన తరువాత మాత్రమే ‘సాహో’ హిందీ వర్షన్ డబ్బింగ్ చెపుతానని ప్రభాస్ ఇప్పటికే దర్శకుడు సుజిత్ కు చెప్పినట్లు టాక్. 

దీనితో ఒకవైపు ‘సాహో’ గ్రాఫిక్స్ పనులు అనుకున్న విధంగా వేగంగా పూర్తికాకపోవడంతో పాటు ప్రభాస్ హిందీ భాష సమస్యల మధ్య దర్శకుడు సుజిత్ తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఇన్ని సమస్యలు దాటుకుని ‘సాహో’ అనుకున్న విధంగా ఆగష్టు 15న విడుదల చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు ‘సాహో’ టీమ్ ఒక్క క్షణం తీరిక లేకుండా పరుగులు పెడుతున్నట్లు సమాచారం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: