ప్ర‌ముఖ తెలుగు సినిమా న‌టుడు  రాళ్ల‌ప‌ల్లి న‌ర్సింహారావు క‌న్నుమూశారు. అనారోగ్యంతో మ్యాక్స్‌ క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నటనే ప్రాణంగా ప్రేమించేవాళ్లలో అరుదైన నటుడు రాళ్లపల్లి. చిన్నతనం నుంచే నాటకాలు వేస్తూ వస్తున్న రాళ్లపల్లి ఇప్పటి వరకూ ఎనిమిది వేలకు పైగా నాటకాల్లో నటించారు. ఇక తనికెళ్ల భరణి లాంటి రచయితలకు మార్గదర్శి కూడా రాళ్లపల్లే అన‌డంలో ఆశ్చర్యం కలగక మానదు.


వివిధ ర‌కాల పాత్ర‌లు పోషిస్తూ ఏ పాత్ర‌లోనైనా లీన‌మైపోయి చేసేవారు. జ్యోతిష్కుడు, హిజ్రా, యానాది, పోలీస్‌, నావికుడు... ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. నటనలో ఆయనకంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉండేది. త‌న‌దైన శైలిలో న‌టిస్తూ ఓ ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకున్నారు. ఈయనకి బాగా పేరు తెచ్చిన నాటకం కన్యాశుల్కం. చదువుకునే రోజుల్లో కళాశాలలో జరిగిన పోటీల కోసం మారని సంసారం అనే నాటిక రాశాడు. రచన, నటన రెండింటికీ అవార్డులు వచ్చాయి. ప్రముఖ నటి భానుమతి గారి చేతుల మీదుగా ఆ అవార్డులు అందుకున్నారు.


 1979లో ‘ కుక్కకాటుకు చెప్పుదెబ్బ’తో సినీ రంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి... శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, ఏప్రిల్‌ 1 విడుదల, ఇలా ర‌క‌ర‌కాల చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.  850కిపైగా చిత్రాల్లో నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: