రాళ్ళపల్లి మంచి నటుడు అని చెప్పనక్కరలేదు. తెరపైన ఇప్పటికీ కదలాడే ఆయన వేసిన ఎన్నో పాత్రలు ఆ విషయాన్ని చెబుతాయి. హాస్యం అంటే ఇది అని కూడా వివరిస్తాయి. అసభ్యమైన డైలాగులు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇపుడు హాస్యం అనుకుంటున్నారు. కానీ మాట విరుపులోనే హాస్యం ఉంటుందని రాళ్ళపల్లి చెప్పారు. వెటకారంతోనే నవ్వు పుట్టించొచ్చు అని రాళ్ళపల్లి నటన చెప్పింది.


రాళ్ళపల్లి మంచి దర్శకుల చేతిలో పడ్డారు. అందుకే ఆయన సినిమాల్లోని పాత్రలు అలా కళ్ళ ముందు కదలాడుతాయి. అభిలాష సినిమాలో జైల్ వార్డెన్ శర్మ పాత్రను ఎవరైనా మరచిపోగలరా. రెండు రెళ్ళు ఆరు సినిమాలో ఇంటి పనివానిగా ఉంటూ అనేక భాషలౌ మాట్లాడుతూ పుట్టించే కామెడీ మరొకరు చేయగలరా. మంత్రి గారి వియ్యంకుడులో అల్లు రామలింగయ్య అల్లుడి పాత్రలో ఇదిగో  ఏడ్డూ అంటూ పిలిస్తే వెంటనే అల్లు వద్దకు చేరి సిఫారసు  పనులు చేసి పెట్టే పాత్రలో రాణించిన రాళ్ళపల్లి నటనకు వేరే తూనికలు ఉంటాయా.


దర్శకుడు వంశీకి ఇష్టమైన నటుడు రాళ్ళపల్లి. ఆయన అన్ని సినిమాల్లోనూ కనిపించి హాస్యం ఒలికించారు. ఇక స్వయంగా అన్నగారు నందమూరి ఏరి కోరి మరీ తన శ్రీనాధ కవిసార్వభౌమ సినిమాలో వూరి  కరణం పాత్రలో రాళ్ళపల్లిని తీసుకున్నారు. ఆ విలన్ పాత్రలో రాణించడమే కాదు శభాష్ అనిపించేశారు. రాళ్ళపల్లి లో నటుడు మాత్రమే కాదు రచయిత, దర్శకుడు కూడా ఉన్నాడు. దాదాపుగా ఎనిమిది వేళ నాటకాలు వేసిన చరిత్ర ఆయనది. రాళ్ళపల్లి మంచి వంటగాడుగా కూడా సినీ జనాలకు తెలుసు. అటువంటి రాళ్ళపల్లి ఇక లేరు అనుకోవడం బాధాకరమే కానీ ఆయన అందించిన హాస్యం పదికాలాల పాటు వెండి తెరపై పదిలంగా ఉందని అనుకున్నపుడు ఆయన మనతోనే ఉన్నారన్న గొప్ప భావన కలుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: