అజిత్‌ హీరోగా తమిళంలో నటించిన 'వాలి' సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ఎస్.జే.సూర్య ఆ తరువాత విజయ్‌ హీరోగా 'ఖుషీ' సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించారు. అంతే కాదు తెలుగులోనూ పవన్‌కల్యాణ్‌ హీరోగా 'ఖుషీ' సినిమా చేసి సక్సెస్‌ అయిన ఎస్‌జే సూర్య ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. అలా నటుడుగా, దర్శకుడిగా రెండు పడవలపైన పయనిస్తూ ఇటీవల సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో నటించిన విలన్ క్యారెక్టర్ కి నటుడిగా గొప్ప పేరు వచ్చింది. 


అయితే ఎస్‌జే సూర్య కథానాయకుడిగా నటించిన 'మాన్‌స్టర్‌' సినిమా రీసెంట్‌గా రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా సూర్య చాలా విషయాలను ప్రేక్షకులకు తెలిపాడు. 'వాలి'తో ఆరంభం అయిన తన సినీ పయనం 'మాన్‌స్టర్‌'తో  ఆగదన్నారు. తాను హిట్టిచ్చినప్పుడు ప్రశంసించిన పాత్రికేయులు, ఫ్లాప్ ఇచ్చినప్పుడు దాన్ని ఎత్తి చూపించి తాను ఈ స్థాయికి రావడానికి కారణంగా నిలిచారని, అలాంటి వారితో చిత్ర విజయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సహాయ దర్శకుడిగా పని చేసిన కాలంలో రూ.50 ఇచ్చి స్టూడియోలోపలికి వెళ్లి షూటింగ్‌ చూసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.


హీరోగా సక్సస్ అవాలన్న తన పాతికేళ్ల కల ఇప్పటికి నెరవేరిందన్నారు. తన గత చిత్రాల మాదిరిగా ఈ సినిమాలో పాటలు, రొమాన్స్‌ సన్నివేశాలు లేకపోవడమే చిత్ర  విజయానికి కారణమన్నారు. ఇప్పటినుంచి 'మాన్‌స్టర్‌' లాంటి మంచి సినిమాలు చేస్తానని, నటుడిగా శ్రమించడమే తన పని అన్నారు. అవకాశాలు రాకపోతే తానే కథలను తయారు చేసుకుని నటిస్తానని చెప్పారు సూర్య.  


మరింత సమాచారం తెలుసుకోండి: