సినీ ఇండస్ట్రీలో ఉన్న చీకటి భాగోతాలను హీరోయిన్స్ బయటపెడుతున్నారు. తమకు జరిగిన చేదు అనుభవాలను మీడియా ముఖంగా చెబుతున్నారు. మలయాళ నటి రేవతి సంపత్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా సిద్ధిఖీ బండారాన్ని బట్టబయలు చేసింది. 2016లో ఓ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా సిద్ధిఖీ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు. 21 ఏళ్ల వయసులో తాను ఈ వేధింపులకు గురైనట్లు తెలిపారు. 


సుఖమాయిరికటే' అనే చిత్రం 2016లో విడుదలైంది. త్రివేండ్రంలోని నీలా థియేటర్లో ఈ మూవీ స్క్రీనింగ్ సమయంలో సిద్ధికీ తన పట్ల సెక్సువల్ మిస్ బిహేవ్ చేశాడని రేవతి ఆరోపించారు. అతడి ప్రవర్తన వల్ల 21 ఏళ్ల వయసులో తాను తీవ్రమైన మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు. అతడి వల్ల తన మనసుకు తగిలిన గాయం ఇప్పటికీ బాధిస్తూనే ఉందని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. 


సిద్ధిఖీకి తన వయసు గల కూతురు ఉందని.... ఇలాంటి వ్యక్తుల వల్ల కూతుళ్లకు కూడా సరైన భద్రత ఉండకపోవచ్చని రేవతి వ్యాఖ్యానించారు. మలయాళ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు ఏర్పడిన సంస్థ ‘ఉమెన్ ఇన్ కలెక్టివ్ సినిమా(డబ్ల్యు‌సిసి) సైతం రేవతి ఇష్యూతో సిద్ధిఖీని టార్గెట్ చేసింది. మలయాళం సినీ ఇండస్ట్రీలో మంచి వారిగా ముసుగు వేసున్న ఎందరో కీచకులు ఉన్నారని, వారంతా ప్రజల ముందు జెంటిల్మెన్‌గా ఫోజులు కొడుతున్నారని, ఏదో ఒక రోజు అలాంటి వారి పాపం పండుతుందని రేవతి సంపత్ వ్యాఖ్యానించారు. సిద్ధికీ వివాదం మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: