ఎన్టీయార్  తోనే తెలుగు సినిమా ఎంతో ఎత్తుకు ఎదిగింది.  ఎన్టీయార్ రాకతోనే మాస్ అన్న పదానికి అర్ధం తెలిసింది. తెలుగు సినిమాకు కలెక్షన్ల జడివాన మొదలైంది కూడా  ఎన్టీయార్ తోనే. ఆయన తొలి స్టార్ హీరో. మనదేశం మూవీతోనే తనలో ఎంతో విషయం  ఉందని కెమెరా సాక్షిగా నిరూపించుకుని పదికాలాలకు సరిపడా ఇమేజ్ కి పునాది వేసుకున్నాడు.


ఎన్టీయార్ అంటే మాస్. మాస్ జనాలకు ఆయనో పూనకం, వెండితెరపై  ఎన్టీయార్  రికార్డులు ఎన్నో ఉన్నాయి. వాటిని బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు. ఆనాడు సూపర్ హిట్లు అయిన లవకుశ, దానవీర శూర కర్ణ, అడవిరాముడు, వేటగాడు వంటి కలెక్షన్లను ఈనాటి డబ్బు విలువతో పోలిస్తే బాహుబలి వంటి రికార్డులు వెనక్కుపోతాయి. కలెక్షన్ల పరంగా నందమూరి స్టామినాకు ఇది ఒక తూకం అయితే. నటనా పరంగా అన్న గారు వేసినన్ని పాత్రలు మరే హీరో ప్రపంచంలోనే వేయలేదన్నది నమ్మి తీరాల్సిన నిజం.


మొత్తం 350 పైగా సినిమాల్లో  ఎన్టీయార్ నటిస్తే అందుకో వేసిన వైవిధ్యమైన పాత్రలు వంద వరకూ ఉంటాయి. మన హీరోలంతా కలసి జీవిత కాలంలో చేసినవి పది పదిహేను మించి పాత్రలు వుండవు. అంటే రొటీన్ మూవీస్ మన వాళ్ళు చేస్తున్నారు. కానీ అనాడే అన్న గారు సినిమా సినిమాకు, పాత్రకు మధ్య ఎంతో తేడాను చూపించి నటించి మెప్పించేవారు.ఇక ఆయనలా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాలు వేసిన నటులు లేనేలేరు.


పదుల సంఖ్యలో  వివిధ జోనర్లలో అయన నటించి మెప్పించారు. ఆడియన్స్ ని ఒప్పించారు. వెండితెర వేలుపుగా వెలిగిన ఎన్టీయార్ ఎంతో మంది హీరోయిన్లతో నటించి అక్కడ కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. దాదాపు ఆరు పదుల వయసుల పదహారు పరువాల శ్రీదేవితో జోడీ కట్టిన వేటగాడు ఎన్టీయార్ . మరి ఈ రికార్డ్ మరే హీరోకు ఉంటుందా. మనవరాలుగా వేసిన శ్రీదేవితోనే డ్యూయెట్లు పాడిన ఘనత ఆయనదే. దర్శకత్వం, ఎడిటింగ్, నిర్మాతగా వ్యవహరించడం, స్క్రీన్ ప్లే ఇలా అన్ని విభాగాల్లో తన పట్టును నిరూపించుకున్న ఏకైక కధానాయకుడు ఎన్టీయార్  అనడంలో సందేహం లేదు.


ఇక ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్ళి కేవలం తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికార పీఠం ఎక్కించిన రికార్డుని ఇంతవరకూ ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు. అలాగే  ఎన్టీయార్  తరువాత సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి రాణించిన నటులు కూడా తెలుగు సీమలో లేకపోవడం మరో రికార్డ్. ఎన్టీయార్  అంటే నెవర్ టర్న్ రిటర్న్. అంతే ఆయన‌కు తిరుగు లేదు. ఎదురులేదు. ఎన్టీయార్ అన్న మూడు అక్షరాలు చాలు తెలుగు సినిమా అంటే చెబుతుంది. తెలుగు రాజకీయం అంటే కూడా చెబుతుంది. ఆయనకు మరణం లేదు.  ఎన్టీయార్  ధ్రువతార. యుగ పురుషుడు, ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఎన్టీయార్ చిరంజీవి.


మరింత సమాచారం తెలుసుకోండి: