రెండు ‘బాహుబలి’ సినిమాలు తెచ్చిన అమేయమైన ఇమేజ్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ హీరోకైనా కనీ వినీ ఎరుగని హిట్ వచ్చిందంటే, ఆ తర్వాత అతనిపై ఉండే ఒత్తిడి అసాధారణం. ప్రేక్షకుల అంచనాలు అంబరాన్నంటుతాయి. వాటిని అందుకోవడం కష్టమైపోతుంది. గతంలో చాలామంది హీరోల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ప్రభాస్ విషయంలో అయితే మహా అంచనాలు నెలకొన్నాయి.


అతడిప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన హీరో కాదు. దేశంలోని అనేక భాషల అభిమాన నటుడు. గతంలో ఏ తెలుగు నటుడికీ దక్కని అరుదైన గౌరవం ఇది. ఆ బరువు బాధ్యతల్ని మోస్తూ ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. అందుకే మామూలు సినిమా కాకుండా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఏక కాలంలో విడుదల చేసే లక్ష్యంతో సూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చాలా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని టి-సిరీస్‌తో కలిసి యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.


తొలి సినిమా ‘రన్ రాజా రన్’తో ఆకట్టుకున్న దర్శకుడు సుజిత్ ఈ సినిమాని హై స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నాడు. 17 ఏళ్ల కెరీర్‌లో ప్రభాస్ చేసింది 18 సినిమాలే. అంటే ఏడాదికి సగటున ఒక్క సినిమానే. 2002 నుంచి 2013 వరకు పన్నెండేళ్ల కాలంలో 15 సినిమాలు చేసిన ప్రభాస్, ఆ తర్వాత ఐదేళ్లలో చేసింది 2 సినిమాలే. అవి ‘బాహుబలి: ద బిగినింగ్’, ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’. ఇప్పుడు చేస్తున్న ‘సాహో’ సినిమా ప్రొడక్షన్ వర్క్ 2017లోనే మొదలైంది.


ఆ ఏడాది ఏప్రిల్‌లో టీజర్‌నూ, అక్టోబర్‌లో ప్రభాస్ ఫస్ట్ లుక్‌నూ రిలీజ్ చేశారు. 2018 అక్టోబర్‌లో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో’ పేరిట ఒక వీడియోను, ఈ ఏడాది మార్చిలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2' పేరిట మరో వీడియోనూ విడుదల చేశారు. ఇవి సినిమాపై అంచనాల్ని మరింత పెంచాయి. 


కాగా ఇటీవలే ప్రభాస్ ఇన్స్‌స్టాగ్రాంలోకి అడుగుపెట్టి షేర్ చేసిన రెండు 'సాహో' పోస్టర్లు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూశాం. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఇప్పుడు 'సాహో' కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతుండటంతో థియేటర్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందని సమాచారం. ఒక్క తెలుగు వెర్షన్‌కే రూ. 150 కోట్ల మేర ప్రి రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


'బాహుబలి' కాకుండా ఆ స్థాయిలో బిజినెస్ అవుతున్న సినిమా మళ్లీ ప్రభాస్‌దే అవుతుండటం గమనార్హం. ఇంతకీ ‘బాహుబలి’ ఇమేజ్ బరువును తట్టుకొని ‘సాహో’తో ప్రభాస్ నిలబడతాడా? వేచి చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: