'బాహుబలి' సిరీస్  తరువాత.. మళ్లీ  తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేది  'సాహో' మాత్రమే అంటూ  ప్రభాస్ ఫ్యాన్స్  సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టుకుంటూ సాంత్వన పొందటం తప్పితే,  వాస్తవ పరిస్థితులు మాత్రం  అందుకు పూర్తి బిన్నంగా  ఉన్నాయి.  షూటింగ్ ముగుంపుకి ఎప్పుడో కొబ్బరికాయ కొట్టాల్సి ఉన్నా.. ఇంకా ప్యాచ్ వర్క్ లకు సంబంధించిన షూటింగ్ పార్టే  మరో వారం రోజులు పట్టేలా ఉందట.  సినిమా విడుదలకు  దాదాపుగా డెబ్బై రోజుల  సమయం మాత్రమే ఉంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి స్థాయిలో మొదలే కాలేదు.  మరో పక్క   సినిమాకి ఉండాల్సిన స్థాయిలో బజ్ లేదు.  అన్నటికిమించీ  అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి కావడం లేదు,  గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్  ఇంకా పెండింగ్ లోనే ఉంది, ప్రమోషన్స్ విషయంలో సరైన ప్లానింగ్ లేదు  వీటన్నిటికీ కారణం దర్శకుడి అనుభవరాహిత్యమే అని ఇప్పటికే యూనిట్ సభ్యులే పెదవి విరుస్తున్నారు.        


సుజిత్ కి  ఒక సినిమా తీసిన అనుభవం మాత్రమే ఉంది.  అదీ ఒక నాలుగు కోట్ల బడ్జెట్ సినిమా.  పైగా ఆ సినిమాలో  భారీ విజువల్స్,  అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ స్,  మైమరపించే విన్యాసాలు.. ఇవేవి లేవు.  కానీ  సాహోలో ఇవే ప్రధానం. ఇక్కడే తేడా కొట్టింది.  అయిన ముప్పై ఏళ్ళు కూడా లేని,  కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన దర్శకుడ్ని నమ్మి..  సుమారు 250 కోట్లు  ఖర్చు పెట్టడం అంటే.. ఖచ్చితంగా ఇది తెలివైన పని అయితే కాదు.  నిజానికి  సాహో ఏభై కోట్లతో మొదలైంది. కానీ అంతలో బాహబలికి వచ్చిన వందల కోట్లును చూసి.. ప్రభాస్ మార్కెట్ కూడా ఇప్పుడు  వందల కోట్లు అనుకుని  లెక్కలు వేసి మరి  'సాహో' నిర్మాతలు బడ్జెట్ ను  ఏభై నుండి  రెండొందల ఏభై కోట్లకు పెంచేశారు.  


మాములుగా  కథను బట్టి బడ్జెట్ ప్లాన్ చేస్తే..  'సాహో'కు మాత్రం బడ్జెట్ పెరిగాక,  కథను ప్లాన్ చేసుకున్నారు.  ఇక 'సాహో' నుండి వచ్చిన  షూటింగ్ వీడియోస్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమా స్థాయికి తగ్గట్లు  ఆకట్టుకోలేకపోయాయి.  పైగా  ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా 'బ్లేడ్ రన్నర్ 2049' అనే హాలీవుడ్ సినిమాకు కాఫీ అని తేలిపోయింది. కనీసం ప్రమోషన్స్ నైనా భారీగా ప్లాన్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తుంటే.. దర్శకుడు మాత్రం వారి ఆలోచనలు అందుకోలేకపోతున్నాడట. పైగా తెలుగులో తప్పితే మిగిలిన భాషల్లోని  'సాహో' వర్షన్స్ కు సంబంధించిన అవుట్ ఫుట్ పై  సుజిత్ పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నాడని టాక్.  ఈ పరిణామాలన్నిటిని పరిశీలిస్తే.. సాహో నిండా  దర్శకుడి  అనుభవరాహిత్యమే కనిపించేలా ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: