ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గంకు సంబంధించిన మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు చేసిన కామెంట్స్ అత్యంత ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు అందరికీ కృష్ణంరాజు తన శుభాకాంక్షలు తెలియచేస్తూ మంత్రివర్గ విస్తరణలో జగన్ తీసుకున్న నిర్ణయం సామాజిక విప్లవానికి నాందిగా తాను భావిస్తున్నట్లు తెలియచేసారు. 

అంతేకాదు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రిమండలిలో ఎస్సీ ఎస్టీ బలహీన మైనారిటీ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించడం జగన్ న్యాయకత్వ లక్షణాలకు నిదర్శనం అంటూ రాజకీయాలలో రియల్ హీరో జగన్ అంటూ కృష్ణంరాజు ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా జగన్ వ్యవహరిస్తున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్న విషయాలను తెలియచేసాడు. 

రాష్ట్ర అభివృద్ధిలో జగన్ పరిపాలన ‘సువర్ణాక్షరాలతో’ లిఖింప తగ్గ చరిత్రగా మారబోతోంది అంటూ కృష్ణంరాజు చేసిన కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. ఇప్పటి వరకు టాప్ హీరోలు ఎవ్వరు జగన్ ను ఈవిధంగా ప్రశంసిస్తూ బహిరంగ ప్రకటన ఇచ్చిన సందర్భం లేదు. 

అయితే ఇప్పుడు రెబల్ స్టార్ ఈ ఒరవడికి శ్రీకారం చుట్టడంతో కృష్ణంరాజును అనుసరిస్తూ చాలామంది హీరోలు ప్రశంసలు బాట పట్టే ఆస్కారం ఉంది. ఫిలిం ఇండస్ట్రీ విశాఖపట్నం వైపు కానీ లేదంటే అమరావతి వైపు కానీ జగన్ ఆద్వర్యంలో అభివృద్ధి చెందడం ఖాయం అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో రానున్న రోజులలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం జగన్ ఎలాంటి వరాలు ప్రకటిస్తారో చూడాలి..  
  


మరింత సమాచారం తెలుసుకోండి: