ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు.  ఎన్నో చిత్రాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ కన్నడ రచయిత మరియు నటుడు గిరీష్ కర్నాడ్ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మధేరాలో గిరీష్ కర్నాడ్ జన్మించారు. పలు తెలుగు చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రలు పోషించారు.


ఆనందభైరవి, శంకర్ దాదా ఎంబీబీఎస్, ధర్మచక్రం, రక్షకుడు, ప్రేమికుడు వంటి పలు చిత్రాల్లో నటించారు. గిరీష్ కర్నాడ్ కర్నాటకకు ఏడవ జ్ఞానపీఠ పురస్కారం అందించి.. కన్నడ సాహిత్యనానికే వన్నెలద్దిన ప్రసిద్ధ నాటక సాహిత్యవేత్త. భారత దేశంలోనే నాటక సాహిత్యంలో విశిష్టమైన రచనలు కావించినందుకు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నమొట్టమొదటి నాటకసాహిత్యవేత్త కూడా గిరీష్ కర్నాడ్ కావడం విశేషం. 


కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు భాషా చిత్రాల్లో గిరీష్ కర్నాడ్ నటించారు. గిరీష్ కర్నాడ్ మృతి పట్ల సినీ రంగానికి చెందిన వారు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గిరీష్ కర్నాడ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: