నాగశౌర్య సరసన చలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న. అయితే హీరోయిన్ గా నటించిన తోలి సినిమానే మంచి హిట్ అవడంతో రష్మికకు ఇక్కడ బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం ఆచి తూచి తన సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. ఆపై ఆమె విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరుగా మారిపోయింది. ఇక ఆ సినిమా అనంతరం ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమాలో నటించే అవకాశం ఆమెను వరించింది. 

మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక, అంత పెద్ద సినిమాలో అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోందట. అయితే ఈ మధ్యలో ఆమెకు వస్తున్న ఇతర సినిమా ఆఫర్లను ఆమె వదులుకుంటోందని కొన్ని టాలీవుడ్ వర్గాల సమాచారం. కాసేపటి క్రితం రష్మిక తమిళ స్టార్ శివకార్తికేయన్ సినిమాలో అవకాశాన్ని వదులుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అటు కోలీవుడ్ మీడియాలో కూడా గుప్పుమంటున్నాయి. 

అయితే నిజానికి శివ కార్తికేయన్ సినిమాలో రష్మిక నటించాలని అనుకుందని, అయితే ఆ చిత్రంలో తన పాత్ర ఆశించిన స్థాయిలో లేదనే ఆమె ఆ అవకాశాన్ని వదులుకుందని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఎంతైనా సూపర్ స్టార్ ప్రక్కన అవకాశం రావడం అంటే మాటలు కాదు కాబట్టి, ఆ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం వల్లనే ఆమె శివకార్తికేయన్ సినిమా చేయలేకపోతోంది అంటూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజమెంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం ఆ చిత్ర యూనిట్ నుండి కానీ, లేదా రష్మిక నుండి కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగవలసిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: