బాహుబలి అంత భారీ స్థాయి సినిమా తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి... భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం పై సినీ మీడియా మరియు ట్రేడ్ వర్గాలు మంచి హోరును సృష్టిస్తున్నాయి.  మరి ఇంత హైప్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అర్ధమవుతుందా ? కొన్ని నిజమైన ఆణిముత్యాలు తప్ప మూడు ఫైట్లు, నాలుగు పాటలు, నానార్ధాలతో సాగే కామెడీ.... ఇవే ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించిన సినిమాలు.


ఒక సినిమా ‘బావుంది’ అంటే దాని అర్ధాలు చాలానే వుంటాయి.  వ్యక్తిగతంగా సినిమా అభిరుచుల్ని బట్టి నచ్చితే వ్యాపారపరంగా ఆ సినిమాకి విజయం దక్కదు.  నవరసభరితమైన సన్నివేశాలతో అన్ని వర్గాలను మెప్పిస్తూ ప్రేక్షకుడిని శుభం కార్డు వరకూ వుంచడమే కాక అదే ప్రేక్షకుడిని మళ్ళీ మళ్ళీ రప్పించగలిగే సినిమా అయితేనే ఒక సినిమా విజయం సాధించినట్టవుతుంది.   కొత్త సినిమాను విడుదలైన క్షణాల్లోనే కక్కుర్తితో తమ మొబైల్ ఫోన్ లలో చూడాలనుకునే ప్రేక్షకులకు నిజంగా ఇంత బడ్జెట్ అవసరమా ? డెభ్భైసంవత్సరాల పై చిలుకు వయస్సు వున్న తెలుగు సినిమా వ్యాపారపరమైన విజయాలు మాత్రం వయస్సులో కనీసం సగం కూడా లేవన్నది కఠోర వాస్తవం. 


పైరసీ, స్టార్ డమ్, టిక్కెట్ వెల ఇలాంటి వెన్నో సమస్యలున్నా తెలుగు సినిమా విలువ ఆకాశన్నంటుతోంది.  దీనికి ఉదాహరణ బాహుబలి.  నిజానికి బాహుబలి కధాంశం మన చందమామ కథలమల్లే ఉంటుంది.  అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా అంతటి ఆదరణకు నోచుకుంది.  కాని సాహో సినిమా అలా కాదు,  పూర్తిగా నేటి తరానికి సంబంధించిన సినిమా.   సినిమా ప్రేక్షకులను ఎ, బి  మరియు సి క్లాస్ గా విభజించుకున్నారు సినీ ట్రేడ్ వర్గాలు.  ఒక సినిమా విజయవంతం అవ్వాలంటే ఎ క్లాస్ బి క్లాస్ చూస్తే సరిపోదు, ముఖ్యంగా సి క్లాస్ రిపీటెడ్ ఆడియన్స్ కావాలి. అంటే మాస్ ఓరియంటెడ్ అప్పీల్ వుండాలి.  కాని సాహో సినిమా టీజర్ చూస్తే పూర్తిగా క్లాస్సీ యాక్షన్ ఫిల్మ్ లా అనిపిస్తుంది.


ఈ మధ్యనే ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది.  టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్రయూనిట్ వర్గాలు ప్రకటించుకున్నాయి.  నిజానికి టీజర్ భారీ ఆంగ్ల సినిమా స్థాయిని మించి పోయింది.  టీజర్ ఆద్యంతం కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్ తో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.  హాలీవుడ్ మించి భారీ స్థాయి సినిమాను ఓ సాధారణ తెలుగు ప్రేక్షకుడు అర్ధం చేసుకోగలడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.  ప్రస్తుత పరిస్థితిలో సాహో సినిమా నిజంగా ఓ సాహసోపేతమైన నిర్ణయం.  నటీనటుల ఇమేజ్ తో పాటు క్రియేటివిటీకి, బడ్జెట్ కి హద్దులు లేకుండా నిర్మించిన ఈ సినిమా నిజంగా విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: