మన తెలుగు యువ హీరోలను ప్రమాదాలు వెంబడిస్తున్నాయి, ఈ మధ్య వరుణ్ తేజ్, నాగశౌర్య, సందీప్ కిషన్‌‌లు ప్రమాదంలో గాయపడగా, వారి జాబితాలో మరో యువ కథానాయకుడు కూడా చేరాడు. ప్రస్తుతం ‘96’ చిత్రం షూటింగ్‌లో హీరో శర్వానంద్‌ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతుండగా, రిస్కీ సీన్ డూప్ లేకుండా చేస్తూ శర్వా ప్రమాదానికి గురయ్యాడు.

 

సినిమాలో స్కై డైవింగ్ షాట్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శర్వానంద్‌కు తీవ్రగాయాలు కాగా, యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శర్వానంద్ భుజానికి, కాలికి గాయాలు అయ్యాయి. నిపుణుల ఆధ్వర్యంలో శ‌ర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్‌లో ఇబ్బందులు ఎదుర‌య్యాయి.

 

కాళ్లపై కిందకు దిగాల్సి రాగా, గాలి తీవ్రత వలన భుజాల‌ను మోపి ల్యాండ్ అయ్యారు. దీంతో షోల్డర్ డిస్క్ లొకేట్ అయ్యింది. కాలికి కూడా స్వల్ప గాయం అయ్యింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత శ‌ర్వానంద్ వెంట‌నే థాయ్‌లాండ్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆయనను ప‌రీక్షించిన వైద్యులు భుజానికి బ‌ల‌మైన గాయమైందని, కాబ‌ట్టి శస్త్ర చికిత్స అవ‌స‌రమ‌ని సూచించారు.

 

సోమ‌వారం ఈ శ‌స్త్ర చికిత్స నిర్వహించనున్నారు. అనంతరం క‌నీసం నాలుగు రోజులు ఆయన హాస్పిట‌ల్‌లోనే ఉండాల్సివుందని వైద్యులు స్పష్టం చేశారు. మరోవైపు, శర్వానంద్‌ గాయపడిన విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ నటులు ఆయన్ను ఫోన్ లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఐతే తనకేమి పెద్ద గాయం తగలలేదని, అభిమానులు నిరుత్సాహ పడవొద్దని శర్వానంద్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: