మల్లేశం ప్రీవ్యూ చూసిన తరువాత నా అనుభూతి.
మల్లేశం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, ఒక వ్యవస్థ వ్యధ. 
మల్లేశం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక జాతి జీవన కన్నీటిదార. 
ప్రవాహంలో మునుగుతూ తేలుతున్నవాడికే తెలుస్తాయి ఈత కొట్టడంలో ఉన్న సాదక బాధకాలు.  ఒక లక్ష్య సాధనలో ఎదురైన అవమానాలను దిగమింగి, అపజయాలను తట్టుకుని, పేదరికాన్ని, నిరక్ష్యరాస్యతను లెక్కచేయక సంకల్పంతో అనుకున్నది సాధించే వరకు మల్లేశం పడిన మానసిక సంఘర్షణే ఈ సినిమా. ఇది వ్యక్తిగతమైన కథ.  
వ్యవస్థాగతంగా చూస్తే యంత్రాలొచ్చాక, ప్యాక్టరీలుపెట్టాక చేతిపనులు అడుగంటిపోయాయి. కుల వృత్తులు కూలబడిపోయాయి.

అంతవరకు స్వయం ఉపాధి కేంద్రాలుగా, చిన్న తరహా పరిశ్రమలుగా పనిచేసిన కుటుంబాలు రోజు వారి కూలి పనులకు వెళ్ళలేక, తరతరాలుగా వస్తున్న చేతివృత్తులను మరువలేక నానా యాతన పడ్డారు. యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని నమ్మాడు చింతకింది మల్లేశం. పెద్దయంత్రం వల్ల కలిగిన గాయాన్ని చిన్నయంత్రంతో నయం చేసాడు. పెరుగుతున్న జనాభా కోరికలను, కొరతను తీర్చేలా చేతివృత్తిని చిన్నపాటి యాంత్రిక శక్తిగా మలిచే ఆలోచన చేశాడు. ఆరిపోతున్న చేనేత జీవన జ్యోతికి తనవంతు చమురునందించాడు.

అలా చేనేత కులపురాణ భావనారుషిగా కీర్తిగడించాడు. కథానాయకులు మనలోనే సామాన్యులు పుడతారని ఈ సినిమా తెలిపింది. అంచెలంచెలుగా కష్టాల కడలి ఈదుకుంటూ నాయకులుగా ఎదుగుతారని నిరూపించింది మల్లేశం జీవితం. దీనిని వెండి తెరపై అత్యంత రమణీయంగా ఆవిష్కరించారు చిత్రబృందం.   
ఈ సినిమా నా చిన్ననాటి జ్ఞాపకాలను, ఆటలను, పాటలను, సంస్కృతిని కలలా ఒక కళగా నా కళ్లముందు చూపించింది. ఇందులో ఆనాటి సంస్కృతి, భాష, భావోద్వోగాలు చక్కగా ఒదిగాయి. హీరో ప్రియదర్శి మల్లేశం పాత్రలో ఒదిగిపోయాడు. చాలా సార్లు కన్నీళ్లు తెప్పించాడు.
హీరోయిన్ పాత్ర కూడా చాలా సహజంగా, అందంగా ఉంది. హీరో తల్లిగా ఝాన్సి, తండ్రిగా ఆనంద చక్రపాణి చాలా చక్కగా నటించారు. సినిమా ప్రారంభంలో వచ్చే తత్వగీతం మనసుని కదిలిస్తుంది. అన్ని పాటలు వినసొంపుగా సందర్భోచితంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన డైరెక్టర్ రాజ్ గారికి, సినిమాలో హీరోయిన్ తండ్రిగా, సినిమా నిర్మాణంలో ప్రొడక్షన్ డిజైనర్ గా తన సేవలందించిన డా. ఏలె లక్ష్మణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 
ఒక సినీ ప్రేక్షకుడు 


మరింత సమాచారం తెలుసుకోండి: