షూటింగ్‌లో భాగంగా హీరో శర్వానంద్ గాయపడిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌లో స్కైడైవింగ్ చేస్తుండగా శర్వానంద్ ప్రమాదానికి గురయ్యారు. శర్వానంద్ భుజానికి, కాళ్లకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆయన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. స్కైడైవింగ్‌ను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో శర్వానంద్ తన కాళ్లపై కాకుండా భుజాలపై ల్యాండ్ అయ్యారు. దీంతో ఆయన భుజానికి పెద్ద గాయమే అయ్యింది. దీనితో పాటు కాళ్లకు కూడా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయి. 


సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో శర్వానంద్ భుజానికి సర్జరీ చేశారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం అయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నలుగురు ఆర్థో సర్జన్‌లు సుమారు 11 గంటలపాటు కష్టపడి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారని వెల్లడించారు. సర్జరీ తరవాత శర్వానంద్‌ను ఐసీయూకు తరలించారని, అక్కడే ఆయన మరో నాలుగు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారని సమాచారం. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయిన తరవాత శర్వా రెండు నెలల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. పూర్తిగా కోలుకున్న తరవాతే శర్వా ‘96’ రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటారు. 


తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారుచేయని ఈ సినిమాలో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. మరోవైపు, ‘రణరంగం’ సినిమాతో త్వరలో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం సమకూర్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: