సినీ నటి విజయశాంతి తనకు కూతురులాంటిది అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆయన ‘పరుచూరి పలుకులు’లో భాగంగా విజయశాంతితో ఉన్న బంధం గురించి మాట్లాడారు. ‘కర్తవ్యం’ సినిమాలోని చివరి అర్ధగంట కథను ఆమె కోరిక మేరకు మార్చామని చెప్పారు. ‘మా కథలు, మాటలు, స్క్రీన్‌ప్లేలో విజయశాంతి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది.

 

విజయ వాహిని స్టూడియోలో ప్రతాప్‌ ఆర్ట్స్‌ రాఘవతో నేను కూర్చుని ఉన్నా. అప్పుడు విజయశాంతిని హీరోయిన్‌గా పరిచయం చేయాడానికి తీసుకొచ్చారు. తనకు 15 ఏళ్లు ఉంటాయి. చాలా సన్నగా ఉండేది. హీరోయిన్‌గా ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ‘ఈ పిల్ల హీరోయిన్‌ ఏంటి?’ అని రాఘవ నవ్వాడు. ‘లేదు.. ఈ అమ్మాయి ముఖంలో చాలా కళ ఉందండి’ అన్నారు. అయినా చాలా చిన్నపిల్ల కదా అని రాఘవ అన్నారు.

 

ఓ రోజు మద్రాసులో ఒకరి పెళ్లికి వెళ్లా. ఆ పెళ్లిలో రత్నం గారి కోరిక మేరకు విజయశాంతికి కథ రాస్తానని మాటిచ్చా. అదే సమయానికి పెళ్లి బాజాలు మోగాయి. ఈ కథ రాసే సమయంలో నేను బెంగళూరులోని ఓ ఆశ్రమంలో ఉండాల్సి వచ్చింది. అక్కడ కూర్చుని ‘కర్తవ్యం’ కథ రాశా. నిజానికి నేను రాసిన కథను సినిమాగా తీయలేదు. కాస్త మార్పులు చేశాం. నేను, అన్నయ్య కూర్చుని మీనా పాత్రను సృష్టించాం.

 

విజయశాంతి హిందీ మార్కెట్‌లోకి అద్భుతంగా వెళ్లిపోయేది. తను మా బిడ్డలానే పెరిగింది. మేం ‘333’ ఫంక్షన్‌ చేసుకున్నప్పుడు ఆమె రాలేకపోయింది. మా కలానికి బలం ఇచ్చిన చాలా మంది వచ్చారు. అప్పుడు తను రాజకీయాలతో బిజీగా ఉంది. అందుకే తను రాలేకపోయింది. నాకు ఆ లోటు అలానే ఉండిపోయింది. విజయశాంతి నువ్వు ఇలా ఉన్నత శిఖరాల్ని చేరుకోవాలని ఆశిస్తున్నా’ అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: