ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది.  ఒక్క పరిపాలన విషయంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ తెలంగాణ వాసులకు అన్యాయం జరిగింది.  దీనిపైనే తెలంగాణా వాసులంతా ఏకమై ఉద్యమం చేశారు.  ఈ ఉద్యమ ఫలితంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది.  రాష్ట్ర ఏర్పాటు తరువాత, తెలంగాణాకు కెసిఆర్ ప్రభుత్వం అనేక వరాలు కురిపించింది. 

 

అందులో ఒకటి తెలంగాణాకు ఫిల్మ్ స్టూడియో.  ఇప్పటి వరకు ఆంధ్రానుంచి వచ్చిన వ్యక్తులకు సంబంధించిన స్టూడియోలు మాత్రమే హైదరాబాద్ లో ఉన్నాయి.  తెలంగాణా వ్యక్తులకు సంబంధించిన స్టూడియోలు ఒక్కటి కూడా లేదు.  తెలంగాణా ఉద్యమ సమయంలో దర్శకుడు ఎన్ శంకర్ జైబోలో తెలంగాణా సినిమా తీశాడు. 

 

ఈ సినిమా స్పూర్తితో తెలంగాణా ఉద్యమం మరింత తారాస్థాయికి చేరుకుంది.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. తెలంగాణాలో స్టూడియోను ఏర్పాటు చేస్తామని కెసిఆర్ చెప్పారు.  అంతేకాదు, రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని కెసిఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు.. అంతా కామ్ అయింది.

 

ఉద్యమ సమయంలో తెలంగాణకు ప్రత్యేక స్టూడియో కోసం స్థలం కేటాయిస్తామని చెప్పిన కెసిఆర్ మొన్నటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  తాజాగా కెసిఆర్ తెలంగాణాలో స్టూడియో ఏర్పాటు కోసం ఎన్ శంకర్ కు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఇది సంతోషించదగిన విషయమని చెప్పాలి.  ఎన్నాళ్ళ నుంచో వేయి కళ్ళతో ఎదురు చూసిన శంకర్ కు ఈ తీపి కబురు మరింత ఆనందాన్ని ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: