ప్రజలకు ఆమె ఒక ఒక నటిగా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడామె మహారాష్ట్రలోని అమ్రావతి నియోజకవర్గం ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రాజకీయ నాయకురాలు. ఆమెది ఆషామాషీ విజయం కాదు... శివసేన పార్టీ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన రాజకీయ దిగ్గజాన్ని ఓడించిన ‘జెయింట్‌ కిల్లర్‌’ ఆమె. సోమవారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన నవనీత్‌ కౌర్‌ రానా ప్రయాణం సినిమాల్లో నుంచి, రాజకీయాల్లోకి ఎలా టర్న్‌ తీసుకుంది? ఆమె మాటల్లోనే...

 

మాది పంజాబ్‌. అయితే నేను పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. నాన్న ఆర్మీ అధికారి. స్థానిక కార్తీక హై స్కూలులో పదో తరగతి వరకు చదివాను. ఇంటర్మీడియెట్‌లో చేరాను కానీ పూర్తి చేయలేకపోయాను. కారణం... అప్పటికే నాకు మోడల్‌గా అవకాశాలొచ్చాయి. దాంతో చదువు అటకెక్కింది. 14 ఏటనే ముఖానికి రంగు వేసుకున్నా. ఒకరోజు మా స్కూలు టీచర్‌ ఒక మ్యూజిక్‌ వీడియో కోసం ఆడిషన్స్‌ ఇవ్వమంది.

 

రెండు మ్యూజిక్‌ వీడియోలు చేసిన తర్వాత తొలిసారిగా ‘దర్శన్‌’ అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘శీను వాసంతి లక్ష్మి’ (2004) ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. తొలి సినిమాతోనే గుర్తింపు దక్కడంతో వరుసగా తెలుగు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ‘శత్రువు’, ‘జగపతి’, ‘రూమ్మేట్స్‌’, ‘మహారథి’, ‘యమదొంగ’ (రంభ), ‘జాబిలమ్మ’, ‘నిర్ణయం’, ‘కాలచక్రం’... ఇలా సుమారు ఇరవై సినిమాల్లో నటించా.

 

పెళ్లయిన తర్వాత నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టాను. మావారు రవి రానా బద్నేరా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా రెండుసార్లు గెలుపొందడానికి ప్రధాన కారణం ఆయన ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంటారు. ప్రజల మధ్యనే ఉంటారు. శివసేన వంటి బలమైన పార్టీ అభ్యర్థులను కూడా ఓడించి, ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యే అయ్యారంటే ఆయన పట్ల ప్రజలకు ఎంత నమ్మకం, గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన బాటలోనే నేను కూడా ప్రజాసేవలోకి అడుగుపెట్టాను.


మరింత సమాచారం తెలుసుకోండి: