తమిళ సినీ పరిశ్రమలో స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోల్లో విజయ్‌కాంత్ ఒకరు. తమిళనాట భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఆయన్ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తెలుగులోనూ విజయ్‌కాంత్ సినిమాకు మంచి ఆదరణ ఉండేది. 'కెప్టెన్ ప్రభాకరన్' సినిమా తర్వాత కెప్టెన్‌గా పాపులర్ అయిన విజయ్‌కాంత్ 'డిఎండికె' అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.

 

తాజాగా విజయ్‌కాంత్ ఆస్తులను ఓ జాతీయ బ్యాంక్ వేలం వేస్తున్నట్లు తమిళ న్యూస్ పేపర్లలో ప్రకటనలు దర్శనం ఇవ్వడంతో అభిమానులు షాకయ్యారు. రూ. 5 కోట్ల అప్పు కట్టక పోవడంతో ఆయన ఆస్తులు వేలం వేస్తున్నట్లు అందులో ఉంది.

 

‘ఆండాల్ అళగర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' పేరుతో విజయ్‌కాంత్ ఓ సంస్థను రన్ చేస్తున్నారు. దీని పేరు మీద రూ. 5 కోట్ల అప్పు తీసుకున్నారు. అయితే ఈ డబ్బు సకాలంలో తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఆయనకు చెందిన ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించారు.

 

తమిళనాడులో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్‌కాంత్‌కు చెందిన డిఎండికె పార్టీ తరుపున పలువురు అభ్యర్థులు బరిలో నిలవగా ఘోర పరాజయం పాలయ్యారు. కొన్ని రోజులుగా విజయ్‌కాంత్ హెల్త్ కండీషన్ కూడా బాగోలేదు. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ తాకుతుండటంతో అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: