నటుడికి తొలి సినిమా చాలా ముఖ్యం. ఏ అడ్డంకులు లేకుండా మంచి హిట్‌ సాధించాలనుకోవడం సహజం. అలాంటిది ఎంతో కష్టపడి తీసిన సినిమా బాగా రాలేదని మళ్లీ మొదటి నుంచి తీయాలని నిర్మాతలు అనుకుంటే? ఆ యాక్టర్‌ కాన్ఫిడెన్స్‌లో కచ్చితంగా డిస్ట్రబెన్స్‌ వస్తుంది.

 

అయితే విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌కి ఇలా జరిగినా కాన్ఫిడెన్స్‌ కోల్పోలేదు. ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు ధృవ్‌. మొదట బాలా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘వర్మ’ టైటిల్‌తో తీశారు. ఆ చిత్రాన్ని ఆపేసి, ‘ఆదిత్యవర్మ’ పేరుతో మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టి, పూర్తి చేశారు.

 

‘ఆదిత్య వర్మ’ పూర్తి కావడం వెనక తన తండ్రి సహకారం ఉందని భావోద్వేగంతో ధృవ్‌ రాసిన లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘సెట్‌ను ప్రతిరోజూ సందర్శిస్తూ, మమ్మల్ని మా శక్తిమేరకు పని చేసేలా ప్రోత్సహిస్తూ,్త, మా అందరి విజన్‌ను ఎప్పటికప్పుడు గైడ్‌ చేస్తూ నన్ను ‘ఆదిత్య వర్మ’ను చేశారు మా నాన్న. నా మీద నాకున్న నమ్మకాన్ని కోల్పోనివ్వకుండా, నా వెనకే ఉంటూ, నాకన్నీ నేర్పిస్తూ ఉన్నావు, ఉంటావు కూడా నాన్నా!

 

నువ్వు లేకుండా ఏదీ అంత సులువుగా జరిగేది కాదు. నన్నెవరో అడిగారు.. ‘సినిమాకు అంత కష్టపడ్డారు కదా, టీజర్‌లో మీ నాన్నగారి పేరెక్కడా? అని. ఆయన పేరు నా పేరు వెనక, ఆయనెప్పుడూ నా వెనక ఉంటారు’ అని బదులిచ్చాను. నువ్వు గర్వపడేలా చేస్తాను నాన్నా’’ అని పేర్కొన్నారు. ‘ఆదిత్య వర్మ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: