ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి తన తండ్రి కోరిక మేరకు క్రికెటర్‌గా ఎలా ఎదిగింది? అంచలంచెలుగా ఎదిగి భారత జట్టులో స్థానాన్ని సంపాదించి విజేతగా ఎలా నిలిచింది అన్నదే ఈ చిత్ర కథ. తమిళ, మలయాళ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

 

తెలుగమ్మాయి అయిన ఐశ్వర్యా రాజేష్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న ఉద్ధేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాను అన్నారు కె.ఎస్. రామారావు. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం శైలజ కృష్ణమూర్తి. ఐశ్వర్యా రాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ చిత్రం కనాకు ఆధారంగా భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 

సీనియర్ నటులు అమర్నాథ్ తనయుడు, నటుడు రాజేష్ కూతురే ఈ ఐశ్వర్య. హాస్యనటి శ్రీలక్ష్మి మనవరాలు. ఈ చిత్రం కోసం క్రికెట్ నేర్చుకుని మరీ నటించింది. రైతు జీవితం, ఓ క్రికెటర్ ఎదుగుదల సమాంతరంగా సాగే చిత్రమిది. నేటి యువతకు, తల్లిదండ్రులకు స్ఫూర్తినిస్తుంది. మహిళా సాధికారతను దర్శకుడు ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారు.

 

భీమినేని, నేను చాలా చిత్రాల్ని రీమేక్ చేశాం. కథాబలమున్న చిత్రాన్ని ఆయన ఏ స్థాయిలో తీర్చిదిద్దగలరో నాకు బాగా తెలుసు. వచ్చే నెల 2న ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. దీనికి ఇండియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. మా సంస్థ ద్వారా ఇక నుంచి మరిన్ని చిత్రాలు నిర్మిస్తాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: