సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఐఎఫ్‌ఏఏ) (నడిగర్‌ సంగమ్‌) ఎన్నికల్లో 51శాతం మంది సభ్యులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ సమయం ముగిసేనాటికి 51శాతం పోలింగ్‌ నమోదయింది. సంఘంలో మొత్తం 3,171 మంది ఓటర్లు ఉండగా.. 1,604 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

మైలాపూర్‌లోని సెయింట్‌ ఎబాస్‌ బాలికల పాఠశాలలో పోలింగ్‌ నిర్వహించారు. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వచ్చే నెల 8న ఈ కేసు విషయంలో తదుపరి విచారణ జరగనుంది. ఆ రోజే ఈ ఎన్నికల కౌటింగ్‌, ఫలితాలు ఎప్పుడు అన్నది మద్రాస్‌ హైకోర్టు తెలపనుంది.

 

నాజర్‌ నేతృత్వంలోని పాండవార్‌ జట్టు, భాగ్యరాజ్‌ స్వామి నేతృత్వంలోని శంకర్‌దాస్‌ జట్టు బరిలో నిలిచాయి. నడిగర్‌ సంఘం అధ్యక్ష పదవికి పాండవార్‌ జట్టు నుంచి నటుడు నాజర్‌, శంకర్‌దాస్‌ జట్టు నుంచి నటుడు భాగ్యరాజ్‌ బరిలో ఉన్నారు. జనరల్‌ సెక్రటరీ పదవికి విశాల్‌, నిర్మాత గణేశ్‌ పోటీపడుతున్నారు. కోశాధికారి పదవికి కార్తీక్‌, ప్రశాంత్‌ బరిలో నిలిచారు.

 

ముంబయిలో 'దర్బార్‌' షూటింగ్‌లో ఉన్న రజనీకాంత్‌కు పోస్టల్‌ బ్యాలెట్‌ సరైన సమయంలో అందకపోవడంతో ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీనిపై రజనీకాంత్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నటి, అభ్యర్థి కోవై సరళ స్పందిస్తూ అనుకున్న సమయానికే పోస్టల్‌ బ్యాలెట్‌ పంపించారని, కానీ రవాణాలో ఆలస్యమవడంతో రజనీ ఓటేయలేకపోయారని తెలిపారు. ఇలా పలువురు మిస్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: