మేల్ డామినేషన్ ఉండే మన భారతీయ సినిమాల్లో ఫిమేల్ ఫేమస్ కావడం అంటే ఆషామాషీ కాదు. హీరోయిన్ గానే కాకుండా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించడమంటే మాటలా. అటువంటి అరుదైన ఘనత సంపాదించిన హీరోయిన్లలో దక్షిణాది నుంచి విజయశాంతిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించటం ఆమె తరువాతే ఎవరైనా. ఒక దశలో దక్షిణాదిలో చిరంజీవి, రజనీకాంత్ లకు సమానంగా ఆమె సూపర్ స్టార్ ఇమేజ్ సాధించారంటే అతిశయోక్తి కాదు. హిందిలో అమితాబచ్చన్ తో నటించి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. దర్శక రచయితలు ఆమెకోసం సెపరేట్ ట్రాక్ లు, స్టోరీలు రాసేవారంటేనే ఆమె సాధించిన స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉండి ఇటివలే మరలా సినిమాల్లోకి రానున్నారు. మహేశ్ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

సినిమాలకు గుడ్ బై చెప్పాక ఆమె రాజకీయాలపై దృష్టి సారించారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారు. ఆమె బీజేపీలో చేరారు. పార్లమెంట్ లో అప్పటి ప్రధాని వాజ్ పేయీ చేత లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఆపై ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆమె తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. కొన్ని కారణాల చేత టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. కొన్నాళ్ల తరువాత కేసీఆర్ తో విభేధించారు. పార్టీ నుంచి బయటకొచ్చాక కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రజలే తన బిడ్డలని ఆమె భావించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితతో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలుండేవి. ఇలా సినిమాల్లో, రాజకీయాల్లో ఆమెది సుదీర్ఘ ప్రయాణమే. సినిమాల్లో సాధించినంత ఘనత రాజకీయాల్లో సాధించకపోయినా రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల వైపు మాత్రం చూడలేదు.

సినిమాల్లో ఆమె స్థాయికి అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్ర తప్ప ఆమెను సాదా సీదా పాత్రల్లో ఊహించడం కష్టం. అటువంటి స్టార్ డమ్ ఆమెది. బాహుబలిలో శివగామి, అత్తారింటికి దారేదిలో నదియా తరహా అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలు తప్ప ఆమె చేయలేరు. దీనిని బట్టి చూస్తుంటే ఇకపై ఆమె రాజకీయాలతో పాటు సినిమాలు చేస్తారా.. లేక సినిమాలు ఎక్కువగా చేస్తారా అనేదే ప్రశ్న. రాజకీయాల్లో కూడా ఆమెకు తక్కువ స్థానం ఏమీ దక్కలేదు. ఎక్కడ ఉన్నా అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నాయి ఆయా రాజకీయ పార్టీలు. మరిప్పుడు రాములమ్మ పయనమెటు? నేడు ఆమె జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాల్లో తిరిగి మరిన్ని మంచి పాత్రలతో అలరించాలని రాజకీయ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: