మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు జరిగిన తర్వాత తొలిసారిగా ఆదివారం కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించారు. ముందుగా సీనియర్‌ నటులు పరుచూరి బ్రదర్స్‌, దేవదాస్‌ కనకాల, కృష్ణంరాజు దంపతులను సన్మానించారు.

 

మా' కు గతంలో అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత కృష్ణ, చిరంజీవి ముఖ్య సలహాదారులుగా ఉండేవారు. ఈసారి ఆ స్థానంలో ప్రముఖ నటుడు కృష్ణంరాజును ఎన్నుకున్నారు. 'మా' అధ్యక్షుడు నరేష్‌ మాట్లాడుతూ కొత్త కమిటీ వచ్చిన వారం రోజుల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కి 30కాల్స్‌ వచ్చాయన్నారు. సలహాల బాక్స్‌కి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు.

 

33 మందికి ఇచ్చే పెన్షన్‌ రూ.6000కి పెంచామని, మేడే రోజున పెన్షన్‌ డేగా జరుపుకోబోతున్నామని ప్రకటించారు. కొత్తవాళ్లకు రూ.25000కే సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ సభ్యత్వం రెండేళ్లపాటు వరుసగా చెల్లిస్తే పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వాలని తీర్మానిచ్చినట్టు స్పష్టం చేశారు.

 

ఇంకా ఆయన మాట్లాడుతూ 'డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, 3 నుంచి ఐదు లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆర్టిస్టులకి వర్తించేలా చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పథకాలు వర్తింప చేస్తామని మంత్రి చెప్పారు. 30 మందికి ప్రభుత్వ నుంచి పెన్షన్స్‌ ఇవ్వనున్నాం. 'మా' బిల్డింగ్‌ కోసం చిరంజీవి సపోర్ట్‌ చేస్తానన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: