యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్', 'ఎవరో ఎవరో' పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ 'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు.
రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ... నాకు సపోర్ట్‌గా ఇద్దరు సూపర్‌ డైరెక్టర్స్‌ ఉన్నారనే ఫీల్‌తో ఉన్నాను. ఇంతకు ముందు కోడి రామకృష్ణగారు, ముత్యాల సుబ్బయ్యగారు, రవిరాజా పినిశెట్టిగారు... నాతో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. నేను ఎప్పుడైనా కమర్షియల్‌గా కిందకు దిగితే వాళ్లు కాపాడతారనే విశ్వాసం, ధైర్యం ఉండేవి. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మతో ధైర్యం వచ్చింది. సి. కల్యాణ్‌గారిని ఇంత కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా బిగినింగ్‌లో చూశా. ఈ మధ్య చూసింది లేదు. ఆయన సంతోషానికి కారణం ‘కల్కి’. నేనింకా సినిమా చూడలేదు. జస్ట్‌ మూడు రీళ్లు మాత్రమే చూశా. ఎందుకంటే... ఫీల్‌ ఎలా ఉందని! ఈ సినిమాలో నేను నటించినా... నెక్ట్స్‌ ఏం వస్తుందోననేది ఊహించలేకపోయా. పోను పోను సూపర్‌గా ఉంటుంది. మా పిల్లలు ఫస్టాఫ్‌ వరకు చూడమన్నారు. నేను చూడలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దీనంతటికీ కారణం ప్రవీణ్‌ సత్తారుగారు. ఆయన నాకు ఒక మార్క్‌ సెట్‌ చేశారు. క్లాస్‌లో మనం డిస్టింక్షన్‌లో పాస్‌ అయితే... తర్వాత ఆ మార్కుల కంటే తక్కువ వస్తే అందరూ తిడతారు. ‘గరుడవేగ’తో మమ్మల్ని ప్రవీణ్‌ సత్తారుగారు ఒక లెవల్‌లో పెట్టారు. ఇప్పుడు మేం లెవల్‌కి వెళ్లాలనేది మా అందరి టార్గెట్‌.  మా మదర్‌ మరణించారనే బాధతో నేనోసారి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకోలేదు. ప్రవీణ్‌ సత్తారుగారు నన్ను, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని వాళ్లింటికి పిలిచి సెలబ్రేట్‌ చేశారు. హోమ్‌ థియేటర్‌లో ‘గరుడవేగ’ ట్రైలర్‌ అందరికీ చూపించారు. అక్కడికి ప్రశాంత్‌ వర్మ కూడా వస్తే... ఆయన్ను పక్కకి తీసుకువెళ్లి ‘ప్రశాంత్‌! మనం ఈ ట్రైలర్‌ని బీట్‌ చేయాలి. నీ వల్ల కుదురుతుందా?’ అన్నాను. ప్రవీణ్‌ సత్తారు పెట్టిన టార్గెట్‌ని బీట్‌ చేయాలి లేదా రీచ్‌ అవ్వాలి అనే ఆలోచనతో కష్టపడి సినిమా చేశాం. రీచ్‌ అయ్యామనే అనుకుంటున్నాం. ‘గరుడవేగ’తో పోలిస్తే... ఇది డిఫరెంట్‌ ఫిల్మ్‌. కాకపోతే ఆ సినిమా చూసిన ఆడియన్స్‌కి కచ్చితంగా ‘కల్కి’ శాటిష్‌ఫ్యాక్షన్‌ ఇస్తుందని చెప్పగలను. నా ప్రతి సినిమాకు జీవిత చాలా కష్టపడతారు. నేను కథ విన్నాక... క్యారెక్టర్‌ గురించి ఆలోచిస్తా. ప్రొడక్షన్‌ గురించి ఆలోచించను. జీవిత కష్టపడి కల్యాణ్‌గారు చెప్పిన బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేశారు. అలాగే, ఈ సినిమాకు నాతో పాటు మా పిల్లలకు కూడా కష్టపడ్డారు. చిరంజీవిగారితో వాళ్లబ్బాయి సినిమా ప్రొడ్యూస్‌ చేస్తున్నారని అనగానే... నాకు అబ్బాయి ఉంటే చేసేవాడని అనుకున్నా. మా అమ్మాయిలు ఇద్దరూ సూపర్‌గా చేశారు. అయామ్‌ వెరీ హ్యాపీ. ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ నా నటనను కొత్తగా చూపించారు. యంగ్‌ జనరేషన్‌ దగ్గర బాగా వర్క్‌ చేయడం నేర్చుకున్నా. యంగ్‌ జనరేషన్‌కి నేను చెప్పేది ఒక్కటే... మంచి సబ్జెక్ట్‌ ఉంటే రండి, సినిమా చేద్దాం. మనకు సూపర్‌ ప్రొడ్యూసర్‌ కల్యాణ్‌గారు ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’ చేస్తున్నా.’’ అన్నారు.


సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘నేను మా చెల్లెలు జీవిత, రాజశేఖర్‌గారు, మా పిల్లలు శివాని, శివాత్మిక కొరకు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించా. రాజశేఖర్‌గారికి ప్రవీణ్‌ సత్తారుగారు ‘గరుడవేగ’ వంటి గొప్ప సినిమా ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి విజయాన్ని మంచి ఈ ‘కల్కి’ ఉంటుందని మాత్రం గర్వంగా చెప్పగలను. రాజశేఖర్‌గారి డైలాగుల్లో చిన్న ఎంటర్‌టైనింగ్‌ గేమ్‌ కూడా ఉంటుంది. ఒక విధంగా ప్రశాంత్‌ వర్మ చాలా ధైర్యంగా చేశారు. నేను సినిమా చూశా. అంతకు ముందు రషెస్‌ ఏవీ చూడలేదు. నిర్మాతగా చెబుతున్నా... కథ విన్నప్పుడు డిఫరెంట్‌ సబ్జెక్ట్‌, ఈ రోజుల్లో దర్శకులు డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారని అనుకున్నా. థియేటర్‌లో లాస్ట్‌ రీల్‌ వరకూ ఆసక్తిగా చూశాను. అంత క్యూరియాసిటీ కలిగించింది. టెక్నికల్‌ వేల్యూస్‌తో, హై బడ్జెట్‌తో తీసిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత ‘మళ్లీ గరుడవేగ, కల్కి వంటి సినిమాలు ఎప్పుడు చేస్తారు?’ అని అందరూ అడుగుతారు. అంత మంచి చిత్రమిది. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. రాజశేఖర్‌గారి సినిమాను ఒకే బయ్యర్‌ కొనడం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. ‘కల్కి’ వరల్డ్‌వైడ్‌ థియేట్రికల్‌ రైట్స్‌ను కె.కె. రాధామోహన్‌గారు తీసుకున్నారు. ఆయన దగ్గర్నుంచి మళ్లీ ప్రాంతాలవారీగా వేర్వేరు వ్యక్తులు తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఇంత క్రేజ్‌ రావడానికి కారణం ప్రశాంత్‌ వర్మ. అతనికి థ్యాంక్స్‌. టీజర్స్‌, ట్రైలర్‌లో మేకింగ్‌ ఎలా ఉందో చూపించాడు. ఎడిటర్‌ గౌతమ్‌, సినిమాటోగ్రాఫర్‌ శివ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రవణ్‌ భరద్వాజ్‌ గ్రేట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చారు. వారం రోజులుగా రాత్రింబవళ్లు టీమ్‌ కష్టపడుతున్నారు. సినిమా విడుదలకు ముందు ఎగ్జిబిటర్స్‌ నుంచి వస్తున్న కాల్స్‌తో సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్నా. విడుదల తర్వాత డబుల్‌ సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్నా’’ అన్నారు.


ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ ‘‘రాజశేఖర్‌గారికి జీవితగారు బ్యాక్‌బోన్‌గా ఉన్నారు. జీవితగారు లేకపోతే ‘గరుడవేగ’ అయ్యేది కాదు. ఇప్పుడూ అదే రిపీట్‌ అవుతుందని అనుకుంటున్నా. రాజశేఖర్‌గారు చేసే ప్రతి సినిమాకు జీవితగారు బ్యాక్‌బోన్‌లా ఉంటున్నారు. సినిమాలో విషయం ఉందా? లేదా? అనేది టీజర్‌ రిలీజ్‌ కాగానే తెలుస్తుంది. ‘కల్కి’ మోషన్‌ పోస్టర్‌ నుంచి చాలా క్యూరియాసిటీ కలిగించింది. టీజర్‌, కమర్షియల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక సినిమాలో ఏదో విషయం ఉందని అందరికీ అర్ధమైంది. ఇప్పుడు హానెస్ట్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. చాలా నిజాయతీగా సినిమా చేశారు. ‘గరుడవేగ’ కన్నా రెండింతలు ఆడాలని కోరుకుంటున్నా. ఇది ఎంత పెద్ద హిట్‌ అయితే... ‘గరుడవేగ 2’కి నేను అంత ఎక్కువ డబ్బులు పెట్టి తీయవచ్చు. నా స్వార్థం నాది. ప్రశాంత్‌ వర్మ తీసిన ‘అ!’ ఫెంటాస్టిక్‌ ఫిల్మ్‌. అటువంటి సినిమాకు స్ర్కీన్‌ప్లే రాయడం చాలా కష్టం. మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్‌ నుంచి ఫర్ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో తన కమాండ్‌ ఏంటో ‘అ!’లో మనకు తెలుస్తుంది. టాలెంట్‌ ఉన్న డైరెక్టర్‌. ఈ సినిమా తనకు మంచి పేరు, పెద్ద సినిమాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. ‘గరుడవేగ’ కన్నా ఈ సినిమా బావుంటుంది. అందులో సందేహం లేదు’’ అన్నారు.


జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి వచ్చిన ప్రవీణ్‌ సత్తారుగారికి థ్యాంక్స్‌. ‘గరుడవేగ’తో రాజశేఖర్‌గారి ఇమేజ్‌ని తీసుకువెళ్లి ప్రవీణ్‌ సత్తారుగారు ఎక్కడో పెట్టారు. ఆ సినిమా తర్వాత చాలా కథలు విన్నాం.  ‘గరుడవేగ’ హిట్‌ కావడంతో చాలామంది నిర్మాతలు సినిమా చేయడానికి వచ్చారు. కానీ, ఎవరొచ్చినా బిజినెస్‌ లెక్కలు వేసుకొచ్చి కథలు చెప్పారు. కొత్త నిర్మాతలు వచ్చి కథ మా ఇష్టమని అన్నా... వాళ్లు ఎలా తీస్తారో తెలియదనే టెన్షన్‌. రకరకాల టెన్షన్స్‌ మధ్య ‘కల్కి’ కథ విన్నాం. దీని ఒరిజినల్‌ రైటర్‌ సాయి తేజ. తను కథ వినిపించాడు. ప్రశాంత్‌ వర్మకు స్ర్కిప్ట్‌ విల్‌ అని కంపెనీ ఉంది. అందులో పది, పన్నెండు మంది రైటర్స్‌ ఉన్నారు. వాళ్ల దగ్గర ఎన్ని కథలున్నాయో. ప్రశాంత్‌కి ఖాళీ దొరికితే తడుముకోకుండా పది కథలు చెబుతాడు. అలా విన్న కథ ఇదే. మా అందరికీ బాగా నచ్చింది. ప్రశాంత్‌ డైరెక్ట్‌ చేస్తే బావుంటుదనుకున్నాం. తను మాత్రం డైలాగ్స్‌, స్ర్కీన్‌ప్లే చేసి వేరొకరితో డైరెక్ట్‌ చేయిస్తానని అన్నాడు. ఫుల్‌ స్ర్కిప్ట్‌, స్ర్కీన్‌ప్లే రెడీ అయ్యాక... ‘ప్రశాంత్‌ నువ్వే డైరెక్ట్‌ చేస్తే బావుంటుంది’ అని అడిగితే ‘సరే’ అన్నాడు. నేనే నిర్మాతగా స్టార్ట్‌ చేశాం. నిర్మాతగా ఉండటం చాలా కష్టం. ఈ బర్డెన్‌ ఎవరితో షేర్‌ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు సి. కల్యాణ్‌ అన్నయ్యను కలిశా. ఆయన ‘ఏం చేస్తున్నావమ్మా’ అని అడిగారు. ‘మనం పార్టనర్స్‌గా చేద్దాం’ అని కల్యాణ్‌ అన్నయ్య జాయిన్‌ అయ్యారు. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పూర్తి చేశాం. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన టీజర్స్‌, కమర్షియల్‌ ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. 


ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందే హానెస్ట్‌ ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం. సినిమా ఎలా ఉంటుందో చెప్పే విధంగా మోషన్‌ పోస్టర్‌, టీజర్‌, కమర్షియల్‌ ట్రైలర్‌, ఇప్పుడీ హానెస్ట్‌ ట్రైలర్‌ డిజైన్‌ చేశాం. కమర్షియల్‌ ట్రైలర్‌ విడుదలైన తర్వాత చాలామంది ‘కల్కి’ని ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో కంపేర్‌ చేశారు. సినిమాలో కామెడీ, ఐటమ్‌ సాంగ్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కమర్షియల్‌ ట్రైలర్‌ కట్‌ చేశాం. సినిమా ఏంటనేది ఈ హానెస్ట్‌ ట్రైలర్‌ చెబుతుంది. 1983 నేపథ్యంలో కథ సాగుతుంది. పీరియడ్‌ సినిమాల కంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కథలతో సినిమాలు తీయడానికి ఇష్టపడే దర్శకుణ్ణి నేను. చాలా రీసెర్చ్‌ చేసిన తర్వాత ‘కల్కి’ చేశా. ఇదొక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. దర్శకుడిగా నా తొలి సినిమా ‘అ!’తో పోలిస్తే ‘కల్కి’ చాలా పెద్ద సినిమా. ఎక్కువ లొకేషన్స్‌లో భారీగా తీశాం. డేంజరస్‌ లొకేషన్స్‌లోనూ షూట్‌ చేశాం. రాజశేఖర్‌గారు ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు. వంద అడుగుల లొతైన ప్రదేశాల్లో షూటింగ్‌ చేశారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ అయితేనే సినిమా బడ్జెట్‌ రాబట్టుకోగలం. ప్రవీణ్‌ సత్తారు ‘గరుడవేగ’ తీసి ఉండకపోతే... ‘కల్కి’ ఉండేది కాదు. జీవితగారు చాలా సహనంతో చాలా పనుల్ని హ్యాండిల్‌ చేస్తున్నారు. నాకు, నిర్మాత సి. కల్యాణ్‌కి  మధ్య వారధి ఆవిడే. ఈ సినిమా కథ సాయి తేజది. స్ర్కిప్ట్‌ విల్‌ స్ర్కీన్‌ప్లే సమకూర్చింది. సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత కూడా స్ర్కిప్ట్‌పై వర్క్‌ చేశాం. సినిమా చూస్తుంటే... తర్వాత ఏం జరుగుతుందోనని ఎవరూ ఊహించలేని విధంగా ‘కల్కి’ ఉంటుంది. ‘కల్కి’ క్యారెక్టర్‌ అందరికీ నచ్చుతుంది. ఈ క్యారెక్టర్‌ని బేస్‌ చేసుకుని సినిమాలు చేయవచ్చు. ఒక ఫ్రాంచైజీలా.  సినిమా చూశాక... అందరూ ‘కల్కి 2’ కోసం వెయిట్‌ చేస్తారు. సినిమాలో రెండు పాటలే ఉన్నాయి. నాలుగు థీమ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. అవి మూడు భాషల్లో ఉంటాయి’’ అన్నారు. 


సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ఇంపార్టెంట్‌లో రోల్‌ ప్లే చేశా. పీరియడ్‌ ఫిల్మ్‌ కనుక విగ్గులు, వాటితో షూటింగ్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేశా’’ అన్నారు.
కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో బలి అనే క్యారెక్టర్‌ చేశా. సినిమా చూస్తే... పక్కాగా నోటీస్‌ చేస్తారు. రాజశేఖర్‌గారితో పని చేయడం నా అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్‌ వర్మకు థ్యాంక్స్‌’’ అన్నారు.


అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. 
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, సమర్పణ: శివాని, శివాత్మిక, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.


మరింత సమాచారం తెలుసుకోండి: