సినీ పరిశ్రమలో తమకు ఇష్టమైన, అభిమానించే హీరోను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి అగ్ర హీరోలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్న వాళ్లే. తాజాగా అదే దారిలో ఇళయదళపతి విజయ్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నది. జూన్ 22వ తేదీ శనివారం విజయ్ పుట్టిన రోజు సందర్బంగా పాలిటిక్స్‌లోకి ఆహ్వానిస్తూ తమిళనాడులో ఆయన ఫ్యాన్స్ హంగామా చేశారు.

 

ప్రముఖ దర్శక, నిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్ తనయుడిగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన విజయ్ కొద్దికాలంలో తమిళనాడులో పవర్‌స్టార్‌గా మారారు. పవన్ కల్యాణ్ నటించిన చిత్రాలను రీమేక్ చేస్తూ క్రేజీ స్టార్‌గా భారీ మొత్తంలో అభిమానులను సంపాదించుకొన్నారు. వరుస హిట్లు ఇస్తూ దక్షిణాదిలో దూసుకెళ్లున్నారు. ఇటీవల కాలంలో విజయ్ రాజకీయాలపై ఆసక్తి ఉన్నారనే విధంగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు.

 

తాజాగా విజయ్ 45వ బర్త్ డే వేడుకల సందర్బంగా ఫ్యాన్స్ హంగామా స్పష్టంగా సంకేతాలిచ్చింది. ప్రజా సీఎం, రేపటి సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు. దళపతి పాలిటిక్స్‌లోకి రా అంటూ పోస్టర్లు కట్టి ఆహ్వానం పలికారు. 2011లో జరిగిన ఎన్నికల ముందే విజయ్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన ఎన్నాడీఎంకేకు మద్దతు తెలియజేయడం అభిమానులను నిరాశ పరిచింది.

 

తాజాగా మెర్సల్ చిత్రాన్ని రూపొందించిన అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో 63వది. ఈ సినిమాకు బిజిల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విజయ్ జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న విజయ్.. గ్యాంగ్‌స్టర్‌గా, ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపిస్తారు. బిజిల్ తాజా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: