అనిల్‌ కపూర్‌ నుంచి రాకేశ్‌ మిశ్రా వరకూ చాలా మంది నటులు, నటీమణులు కలిశారు. నాపై ఓ డాక్యుమెంటరీ తీద్దామని అనుకున్నారు' అని అథ్లెట్‌ దుతీ చంద్‌ పేర్కొంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఎక్కడైనా బయోపిక్‌లను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో అథ్లెట్‌ దుతీ చంద్‌ జీవిత కథ వెండితెరపై రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో చాలా మంది దర్శక నిర్మాతలు ఈమెను కలిసినా వాళ్లతో ఈ బయోపిక్‌ను చేయించేందుకు ఆమె ఆసక్తి చూపలేదు.

 

దుతీ బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌కి అభిమాని. తన బయోపిక్‌ను కంగనా చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. ''నా జీవితం ఓ పెద్ద కథ. నేను చాలా ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొన్నా. వాటిల్ని అధిగమించి మన దేశం కోసం నేను పతకం సాధించా. అనిల్‌ కపూర్‌ నుంచి రాకేశ్‌ మెహ్రా వరకూ చాలా మంది నా బయోపిక్‌ తీస్తామని ఫిల్మ్‌మేకర్‌ వచ్చారు కానీ నేను ఎవరికీ అనుమతి ఇవ్వలేదు'' అని చెప్పింది దుతీ.

 

ఎవరు మీ బయోపిక్‌ చేస్తే బాగుటుందని భావిస్తున్నారన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ... ' నాపై బయోపిక్‌ తీసేందుకు కథ సిద్ధం చేయాలి. నా కుటుంబ గురించి పరిశోధన చేయాలి. అవన్నీ అయ్యాక నా పాత్రకి ఎవరు సరిపోతారో నిర్ణయించేది నిర్మాతలు, దర్శకులే. అది వాళ్ల పని. భాగ్‌ మిల్ఖా భాగ్‌, దంగల్‌, మేరీ కోమ్‌ వంటి బయోపిక్స్‌ చూశాను. మేరీ కోమ్‌లో ప్రియాంక చోప్రా బాగా చేశారు.

 

అయితే చివరికి ఎవరిని నా పాత్ర కోసం ఎంపిక చేస్తారో తెలియదు, కానీ ఆన్‌స్క్రీన్‌లో కంగనా రనౌత్‌ అయితే సరిపోతుంది. నటిగా ఆమె అంటే నాకిష్టం'' అని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై కంగనా స్పందిస్తూ...'దుతీజీ ధైర్యవంతురాలు. ఆమె తన వృత్తి జీవితంలో మాత్రమే ఆమె ఏంటో నిరూపించుకోలేదు...తన వ్యక్తిగత జీవితంలోనూ గొప్ప వ్యక్తిగా నిలిచింది. తన పాత్రకు నేను సరిపోతానని దుతీ భావించడం నాకు చాలా ఆనందంగా ఉంది'' అని పేర్కొంది కంగనా.


మరింత సమాచారం తెలుసుకోండి: