వైద్య విద్యలో ప్రవేశాలకై నిర్వహించే నీట్‌ పరీక్ష కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జీవితాలు కోల్పోతున్నారని నటి జ్యోతిక ఆవేదన‍ వ్యక్తం చేశారు.  దేశవ్యాప్తంగా 35 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, అందులో మాతృబాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు నీట్‌లో ఎలా రాణించగలరని ప్రశ్నించారు.

 

పెళ్లి తర్వాత తిరిగి సినిమాల్లో ప్రవేశించిన జ్యోతిక ప్రస్తుతం ‘రాక్షసి’  అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో ఆమె విద్యా వ్యవస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అసలే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు చాలా తక్కువగా ఉంటుంది. ఇక నీట్ వంటి పరీక్షలకు విద్యార్థులు ప్రత్యేకంగా శిక్షణ ఎలా తీసుకుంటారు. జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రణాళికలు‌ రూపొందించాల్సి ఉంటుంది.

 

ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక్కసారిగా నీట్ వంటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల మానసిక పరిస్థితి ఎలా వుంటుందో ప్రభుత్వాలకు అర్థం కాదా. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తుకై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే లక్షలాది మంది జీవితాలు బాగుంటాయి.. అని జ్యోతిక అభిప్రాయపడ్డారు. కాగా వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో ఉత్తీర్ణులు కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: