సూపర్‌ హీరోలందరూ కలిసి వెండితెరపై సందడి చేసిన చిత్రం ‘అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌’. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, వసూళ్ల విషయంలో జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ‘అవతార్‌’ను మాత్రం దాటలేకపోయింది. దీంతో కొన్ని సన్నివేశాలను జోడించి ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా ‘అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌’ ఇప్పటివరకూ 2.75 బిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. కాగా, 2010లో వచ్చిన ‘అవతార్‌’ ఏకంగా 2.788 బిలియన్‌ డాలర్ల రికార్డుతో ఉంది. సూపర్‌ హీరోలు అవతార్‌ను అధిగమించాలంటే ఇంకా దాదాపు 40మిలియన్‌ డాలర్లను వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ అమెరికాలోని పలు థియేటర్లలో ఈ సినిమా ఆడుతుండగా, ఇటీవల వారాంతానికి వసూళ్లు చూసుకుంటే 2మిలియన్‌ డాలర్ల మించి రావడం లేదు.

 

రీరిలీజ్‌ల చరిత్ర చూసుకుంటే చాలా తక్కువ సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు రాబట్టాయి. వాటిలో జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ‘టైటానిక్‌’ ఒకటి. 2012లో కేవలం 3డీలో ఈ సినిమా విడుదల చేయగా, 350 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. దీంతో ఆ చిత్రం 2బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. అత్యధిక వసూళ్లు చైనా నుంచి రావడం గమనార్హం. దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ‘జురాసిక్‌ పార్క్‌’ సినిమాను 3డీలో విడుదల చేయగా, 100మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.

 

అదే విధంగా ‘ది లయన్‌ కింగ్‌’ను కూడా మళ్లీ విడుదల చేస్తే ఏకంగా 200మిలియన్‌ డాలర్లను రాబట్టింది. ఇలా కొన్ని సినిమాలు తప్పితే మిగిలినవేవీ ఆశించిన రీతిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. మరి ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఏం చేస్తుందో చూడాలి. అన్నట్లు ఈ రీ రిలీజ్‌లో హల్క్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. చూద్దాం!


మరింత సమాచారం తెలుసుకోండి: