తెలుగు హిట్‌ ‘అర్జున్‌ రెడ్డి’కి హిందీ రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లో (దేశవ్యాప్తంగా) రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. సీబీఎఫ్‌సీ దగ్గర ‘ఎ’ సర్టిఫికెట్‌ పొంది, సాధారణ టికెట్‌ ధరతో, ఎటువంటి సెలవులు లేకుండా, ప్రపంచ కప్‌ జరుగుతున్న సమయంలో విడుదలైన చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషమని సినీ విశ్లేషకులు అంటున్నారు.

 

ఇది ‘బాక్సాఫీస్‌  బ్లాక్‌బస్టర్‌’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం తొలి రోజున రూ.20.21 కోట్లు (శుక్రవారం), శనివారం రూ.22.71 కోట్లు, ఆదివారం రూ.27.91 కోట్లు, సోమవారం రూ.17.54 కోట్లు రాబట్టినట్లు తెలిపారు. అమెరికాలో ఈ సినిమాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో రెండో వారం నుంచి (జూన్‌ 28న) 45 సెంటర్లను పొడిగించారు. విదేశాల్లోనూ ఈ సినిమా విశేషమైన వసూళ్లు రాబడుతోందని విశ్లేషకులు వెల్లడించారు.

 

‘కబీర్‌ సింగ్‌’కు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ జంటగా నటించారు. ఈ సినిమా హీరో షాహిద్‌ కపూర్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. అదేవిధంగా ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. రూ.42.30 కోట్లతో (ఓపెనింగ్‌) ‘భారత్’ మొదటి స్థానంలో ఉంది. ‘కళంక్‌’ రూ.21.60 కోట్లు, ‘కేసరి’ రూ.21.06 కోట్లు రాబట్టి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

 

దానికి తోడు నిన్న సీబీఎఫ్‌సీ సభ్యురాలు, బుల్లితెర నటి వాణి త్రిపాఠి ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంపై మండిపడ్డారు. ఇది హింసాత్మకమైన చిత్రమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రాన్ని చూసిన ఆమె ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అర్జున్‌రెడ్డి’ ఓ చెత్త సినిమా అనుకుంటే ఇప్పుడు దానికి తోడు ఇది వచ్చిందని అన్నారు. మరోపక్క ‘కబీర్‌ సింగ్‌’ బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: